Modern Dhobighat: రజక యువకులు కులవృత్తి పట్ల ఆసక్తి చూపకపోవడంతో పనిని సులభతరం చేసేందుకు ప్రభుత్వం ఆధునిక సొబగులు దిద్దుతోంది. గతంలోలాగా దుస్తులు మోసుకుంటూ వాగులు, చెరువుల వద్దకు వెళ్లకుండా యంత్రాల ద్వారా వస్త్రాలు ఉతికే ఏర్పాట్లు చేస్తుంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 18 చోట్ల ఆధునిక ధోబీఘాట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వీటిలో పూర్తయిన మొదటి యాంత్రీకృత ధోబీఘాట్‌ను సిరిసిల్ల జిల్లా వెంకంపేటలో మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రెండు ధోబీఘాట్లు ఏర్పాటు చేసేందుకు 2కోట్ల 68 లక్షలు మంజూరు చేయగా.. తొలి విడతగా కోటి 34లక్షలతో ఒక ధోబీఘాట్‌ను పూర్తి చేశారు. త్వరలో మరొకటి నిర్మించడంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే ప్రణాళిక అమలు చేస్తున్నారు. ఇందుకోసం ఒక కమిటీ ఏర్పాటు చేసి.. కనీసం 20మందికి ఉపాధి కల్పించనున్నారు. గంటకు ఒక సైకిల్ చొప్పున 240బట్టలు ఉతికి ఇస్త్రీ చేసేలా యంత్రాలను రూపొందించారు. ఒక షిఫ్ట్‌లో 8 సైకిల్స్ ఉంటాయని 1920 వస్త్రాల చొప్పున రెండు షిఫ్టుల్లో 3,840 దుస్తులను ఉతికి ఇస్త్రీ చేసేలా రూపకల్పన చేశారు.
గౌరవంగా వృత్తి చేసుకునేలా..
గతంలో సబ్బు, సోడాతో ఉతకడం వల్ల అనారోగ్యాల బారిన పడేవారమని రజక వృత్తిదారులు చెబుతున్నారు. దుస్తులు తీసుకొని నదులు, చెరువుల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. గౌరవంగా తమ వృత్తి చేసుకునేలా రూపకల్పన చేశారని సంతోషపడుతున్నారు. రజక వృత్తిలో పాత తరం వాళ్లే తప్ప నేటి యువత ఆసక్తి చూపడం లేదనే నానుడికి కేటీఆర్ స్వస్తి పలకారని రజక సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. సిరిసిల్లలో యాంత్రీకృత ధోబీఘాట్ ఏర్పాటుతో ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లాలనుకునేవారు... సొంతూర్లలోనే ఉంటున్నారని చెబుతున్నారు.
వృత్తిదారులకు శిక్షణ
ప్రభుత్వం ఆధునిక ధోబీఘాట్ల నిర్మాణంతోపాటు వృత్తిదారులకు అవసరమైన శిక్షణ ఇస్తుంది. 250యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇస్తుండటంతో కులవృత్తుల పట్ల ఆదరణ పెరుగుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇదీ చదవండి: