Minister KTR Distributed Tabs to Students: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లిలో కేటీఆర్ పర్యటించారు. కొత్తగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. సమగ్రమైన ఆలోచన విధానంతో విద్యావ్యవస్థలో సమూలమైన మార్పులకు శ్రీకారం చుడుతున్నట్లు రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఎల్లారెడ్డిపేటలో 'గిఫ్ట్ ఏ స్మైల్' కార్యక్రమంలో భాగంగా మంత్రి విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేశారు.
రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని 26వేల పాఠశాలలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఆంగ్ల మాధ్యమాలు కూడా అందుబాటులోకి తెస్తామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. పాఠశాల విద్యార్థులకు రూ.86 వేల ఖరీదు గల ట్యాబ్‌లను ఉచితంగా అందజేస్తున్నామని తెలిపారు. ఇందులో మీకు భవిష్యత్తులో ఉన్నత విద్యను అందించేందుకు వీలుగా సాఫ్ట్వేర్ అందుబాటులో ఉందని మంత్రి విద్యార్థులకు చెప్పారు.
Minister KTR Visited Rajanna Sirisilla District: కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ విద్యార్థుల మధ్యకు వెళ్లి... వారితో కలిసి సందడి చేశారు. ప్రపంచంతో పోటీపడే పౌరుల్లాగా, విద్యార్థులు తయారు కావాలని కేటీఆర్ ఆకాంక్షించారు. కేవలం సిరిసిల్లలోనే కాకుండా పక్కనే ఉన్న వేములవాడలోను అందజేస్తున్నామన్నారు. విద్యార్థులు, ట్యాబ్‌లను సమర్థవంతంగా వాడుకోవాలని తెలిపారు.
వేములవాడ నియోజకవర్గంలో 3 వేల ట్యాబ్‌లు అందిస్తామని మంత్రి వెల్లడించారు. ఈ మేరకు జాతీయ స్థాయిలో ప్రవేశ పరీక్షల్లో ర్యాంకులను సాధించాలని విద్యార్థులకు చెప్పారు. గడచిన మూడు నెలల్లో స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలే మూడు స్థానాలు దక్కించుకోవడం సంతోషకరమని హర్షం వ్యక్తం చేశారు. 2022 అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు త్రైమాసికంలో గ్రామీణ స్వచ్ఛ సర్వేక్షణ్‌లో దేశంలోనే తొలి స్థానంలో రాజన్న సిరిసిల్ల జిల్లా నిలిచిందన్నారు.
Minister KTR Launched Center for The Elderly: రాష్ట్రంలో తొలిసారి వృద్ధుల కేంద్రం బీఆర్ఎస్ సర్కార్ ఎర్పాటు చేసిందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో వృద్ధుల కేంద్రాన్ని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. దీనిని రూ.40 లక్షలతో 25 పడకల సామర్థంతో వృద్ధుల కేంద్రం ఏర్పాటు చేశామని కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు సంరక్షణ కేంద్రంలోని వృద్ధుల యోగక్షేమాలను మంత్రి కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. వృద్ధులలో ఆనందం నింపటానికి వారితో కలిసి మంత్రి క్యారమ్స్ ఆడారు. వారికి ప్రభుత్వం తరపున భరోసా ఇచ్చారు.
ఇవీ చదవండి: