వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలను 3 రోజుల పాటు వైభవోపేతంగా నిర్వహిస్తామని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. మంగళవారం.. శ్రీ పార్వతీ సమేత రాజరాజేశ్వరస్వామి వారిని మంత్రి దర్శించుకున్నారు. దర్శనానంతరం.. అర్చకులు వేద ఆశీర్వచనం చేసి, తీర్థ ప్రసాదాలు అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు.
రాష్ట్రంలోనే వేములవాడ ప్రసిద్ధి చెందిన శైవక్షేత్రమని.. సీఎం కేసీఆర్ సైతం స్వామివారి సేవలో తరించారని ఇంద్రకరణ్ పేర్కొన్నారు. శివరాత్రి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది వేడుకలకు 4 లక్షల మంది వస్తారని అంచనాతో అన్ని వసతులు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి భక్తులు తరలివస్తారని చెప్పారు.
కరోనా నేపథ్యంలో భక్తులంతా తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని మంత్రి సూచించారు. ఏర్పాట్లపై కలెక్టర్ కృష్ణభాస్కర్, ఎస్పీ రాహుల్ హెగ్డే, ఈఓ కృష్ణ ప్రసాద్, ఇతర జిల్లాస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఇదీ చదవండి: శిథిలావస్థలో చారిత్రక భవనం.. అభివృద్ధి చేయాలని ప్రజల విన్నపం