దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర పుణ్యక్షేత్రంలో నేటి నుంచి మూడు రోజుల పాటు జరగనున్న మహా శివరాత్రి జాతర నిర్వహణకు సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులందరూ సంసిద్దంగా ఉండాలని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశించారు. వేములవాడ దేవస్థానంలోని అతిథి గృహంలో కలెక్టర్ కృష్ణ భాస్కర్, ఎస్పీ రాహుల్ హెగ్డే, సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులతో మహా శివరాత్రి జాతర ఏర్పాట్లపై మంత్రి సమీక్షించారు. సంబంధిత శాఖల అధికారులు చేపట్టాల్సిన చర్యలు,తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. మహా శివరాత్రి జాతరను అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు.
జాతరను విజయవంతం చేయాలి..
ప్రభుత్వ శాఖల అధికారులందరూ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని జాతర విజయవంతానికి కృషి చేయాలని మంత్రి ఆదేశించారు. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ భక్తులు దర్శనం చేసుకోవాలని కోరారు. కొవిడ్ దృష్ట్యా ఈ సంవత్సరం ఆలయంలోని ధర్మగుండంలో స్నానాలకు అనుమతి లేదని మంత్రి స్పష్టం చేశారు. శివార్చన, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. భక్తుల సౌకర్యార్థం స్నానాల కోసం ఇబ్బందులు కలగకుండా తాత్కాలిక షవర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా అధికారులు క్షేత్ర స్థాయిలో నిమగ్నమై తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.
హెలీటాక్సీ సేవలు
జాతర నిర్వహించే మూడు రోజులపాటు ఒక్కో రోజుకు దాదాపు లక్ష మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఆ దిశగా అధికారులు అన్ని ఏర్పాట్లను చేయాలని మంత్రి ఆదేశించారు. తాగు నీటి సదుపాయం కల్పించాలని అన్నారు. వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. ఆలయ పరిసరాలలో ఎలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా ఫైర్ సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు. జాతరకు ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా సీజనల్ వ్యాధులు, ఇతర వ్యాధులు ప్రబలకుండా ఆలయ పరిసరాలలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని మున్సిపల్ అధికారులను మంత్రి ఆదేశించారు. మూడు రోజులపాటు విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని మంత్రి అన్నారు. గత సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా హెలిటాక్సీ సేవలు అందుబాటులో ఉంటాయని మంత్రి వెల్లడించారు. పట్టణంలోని ప్రైవేటు లాడ్జ్‌లలో గదుల ధరలు పెంచకుండా పోలీస్, మున్సిపల్ అధికారులు తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
పటిష్టంగా బందోబస్తు
పోలీస్ బందోబస్తు పటిష్టంగా చేపట్టాలని మంత్రి సూచించారు. క్షేత్ర స్థాయిలో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా బందోబస్తు నిర్వహించాలని సూచించారు. భక్తుల కోసం యంత్రాంగం తరపున 90 వేల మాస్కులను, శానిటైజర్లను అందుబాటులో ఉంచామని అన్నారు. క్షేత్ర స్థాయిలో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా తగు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు. కొత్తగా 25 వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులు కొవిడ్ నిబంధనలు పాటించేలా ప్రచారం కల్పిస్తున్నామని అన్నారు. జాతర నేపథ్యంలో 2 వేల మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. దాదాపు 500 సీసీ కెమెరాల పర్యవేక్షణలో జాతర నిర్వహిస్తామని వివరించారు.
ఇదీ చదవండి: వేములవాడ మహాశివరాత్రి జాతరకు హెలికాప్టర్ సేవలు