KTR review meeting in RajannaSirisilla District: ముస్తాబాద్, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట మండలాల్లోని పలు గ్రామాల్లో మంజూరైన ఇళ్లను సాధ్యమైనంత త్వరగా గ్రౌండ్ చేయాలని అధికారులకు కేటీఆర్ ఆదేశించారు. లాటరీ పద్ధతిలో అత్యంత పారదర్శకంగా ఇళ్లను అర్హులకు కేటాయించాలన్నారు. రాజకీయ పార్టీలకతీతంగా ఇళ్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అందజేయాలని తెలిపారు.
ఇళ్లు పూర్తయ్యేలా.. చూడాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు. జిల్లాకు మంజూరైన 6886 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సిరిసిల్ల నియోజకవర్గం మాదిరిగానే వేములవాడ, చొప్పదండి, మానకొండూరు నియోజకవర్గాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పేదలకు పంపిణీ చేయాలన్నారు. సంక్రాంతి పండగ లోగా ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో సంతృప్తి స్థాయిలో సిరిసిల్ల జిల్లాలో అన్ని మండలాల్లో ఇళ్లు కావలసినవారు ఎంత మంది ఉన్నారో.. లెక్కలు చెప్పాలన్నారు.
సంక్రాంతి తర్వాత అర్హులందరికీ.. ఇళ్లను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలోని ఏ ఒక్క గ్రామంలో ఇల్లు లేని వారు ఉండకూడదని కేటీఆర్ అన్నారు. ఇల్లు కట్టడం పెళ్లి చేయడం సమాన్య ప్రజలకు కష్టమైన పని కాబట్టి ఆ రెండు పనులను రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని హామీ ఇచ్చారు. సిరిసిల్లలో ఇప్పటి వరకు పూర్తయి పంపిణీకి సిద్ధంగా ఉన్న ఇళ్లను డిసెంబర్ రెండో వారంలో పేదలకు పంపిణీ చేయాలన్నారు.
జిల్లాలో రెండు పడక గదుల ఇళ్ల పురోగతి మిగతా జిల్లాల కంటే.. సిరిసిల్ల జిల్లాలో బాగుందని కేటీఆర్ అధికారులను అభినందించారు. అనంతరం మన ఊరు, మనబడి కార్యక్రమం, జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు వాటి పురోగతిపై కలెక్టర్ అనురాగ జయంతితో కేటీఆర్ సమీక్షించారు.
ఇవీ చదవండి: