వేములవాడ ఎమ్మెల్యే సీహెచ్. రమేశ్ బాబు తన పదవికి రాజీనామా చేయాలని స్వతంత్ర ఎమ్మెల్యేగా పోటీ చేసిన రవితేజగౌడ్ డిమాండ్ చేశారు. జర్మనీలో ఉన్న ఎమ్మెల్యే రమేశ్ బాబుని నియోజకవర్గానికి తీసుకురావడానికి విమాన టికెట్ కోసం స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థుల బృందం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో భిక్షాటన చేశారు. కరోనా సమయంలో ప్రజల ప్రాణాలను గాల్లో దీపంలాగా వదిలి ఎమ్మెల్యే జర్మనీకి వెళ్లి పోయారని విమర్శించారు.
ఎమ్మెల్యే 8 నెలల వేతనాన్ని నియోజకవర్గం అభివృద్ధి కోసం కేటాయిస్తున్నట్లు బహిరంగ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాల కోసం ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితిలో ప్రజలు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికులను ఎన్నుకుంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదన్నారు. ఈ కార్యక్రమంలో స్వతంత్య్ర అభ్యర్థులుగా పోటీ చేసిన కోట శ్యాంకుమార్, చిన్న ధనరాజ్, సిరివేరు శ్రీకాంత్, కరుణాకర్ రెడ్డి, విక్రంరెడ్డి, మోతె నరేశ్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'కేసీఆర్ పనితీరుకు అల్లర్లు లేని హైదరాబాదే నిదర్శనం'