పట్టణాలు నీటి ముంపునకు గురికావటానికి కాలువలు, నాలాల ఆక్రమణ ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. సిరిసిల్ల పట్టణం.. నీటిలో మునగడానికి ప్రధానంగా.. కాలువలు, నాలాలు ఆక్రమించడమేనని అధికారులు తేల్చారు. ముంపునకు కారణమైన ఆక్రమణలను తొలగించేందుకు సిద్దమైన క్రమంలోనే.. మరోసారి వరద నీరు ముప్పు తిప్పలు పెట్టింది. ఆ వరద నీరంతా రోడ్డెక్కి ఇళ్లలోకి వచ్చింది. దాదాపు రెండు రోజుల పాటు నీట మునిగిన ఇళ్లు ఇప్పుడు బురదతో నిండుకున్నాయి. పక్షం రోజుల క్రితం వెంకంపేట, ప్రగతినగర్, శివనగర్, అశోక్‌నగర్, పద్మానగర్, జయప్రకాశ్‌నగర్, అంబికానగర్, అనంతనగర్, సంజీవయ్యనగర్, సర్ధార్‌నగర్ కాలనీలను వరద నీరు పూర్తిగా ముంచేసింది. ఇప్పుడిప్పుడే ముంపు నుంచి తేరుకుంటున్న క్రమంలో... గులాబ్ పుణ్యమా అని మరోసారి శాంతినగర్ నీట మునిగింది. కొత్త చెరువు మత్తడి దూకడం వల్ల సీన్ రిపీట్ అయ్యింది.
గడువులోపు అందిచగలమా..?
పట్టణంలో శాంతినగర్‌లోని మరమగ్గ కార్మికులను వరద నిండా ముంచింది. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా చీరలు తయారు చేయగలమా..? అన్న ఆందోళన కార్మికుల్లో నెలకొంది. విద్యుత్ మోటార్ల ఆధారంగా మరమగ్గాలు నడిపించే తమను వరద నీరు నిండా ముంచేసిందని కార్మికులు గగ్గోలు పెడుతున్నారు. ఆడపడుచులకు బతుకమ్మ చీరలు అందించేందుకు ఈ నెల 15 ఆఖరు తేదీ కాగా.. వర్షం కారణంగా పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. ఇంతకు ముందు వర్షానికి దాదాపు 134 వస్త్రపరిశ్రమలు నీట మునిగాయి. ముడిసరుకులు తడిసిపోగా.. వాటిని ఆరబెట్టుకొని విద్యుత్ పరికరాలను సరిచేసుకొని సిద్ధమయ్యేసరికి... మరోసారి వరద తమ కొంప ముంచిందని కార్మికులు వాపోతున్నారు.
ప్రత్యేక పరికరాలతో డిజైన్లు..
పండుగను పురస్కరించుకొని ఇప్పటికే తయారు చేసిన బతుకమ్మ చీరలను హైదరాబాద్ తరలించారు. ప్యాకింగ్ కూడా మొదలుపెట్టారు. ఈసారి రూ.333 కోట్లు కేటాయించి టెస్కో ఆధ్వర్యంలో కోటి చీరలను తయారు చేయించేందుకు మూడు జిల్లాల్లోని పవర్‌లూమ్స్‌కు ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. సిరిసిల్లలోని పవర్‌లూమ్స్ 75 లక్షలు, వరంగల్‌లో 13 లక్షలు, కరీంనగర్‌లో 12 లక్షల చీరలు తయారు చేయాలని ఆర్డర్లు ఇచ్చింది. ఈ సారి 17 రంగులు, 15 డిజైన్లలో చీరలివ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన దృష్ట్యా... చీర కొంగుపై బంగారు వర్ణంలో డిజైన్లు రూపొందించేందుకు ఒక్కో మరమగ్గానికి రూ.20 వేలు వెచ్చించి డాబీ జకాట్ పరికరాలను అమర్చుకున్నామని మరమగ్గ యజమానులు తెలిపారు. ఇప్పటికే ఉత్పత్తి చేసిన వస్త్రంతో పాటు, ముడిసరుకు, విద్యుత్ పరికరాలను సరిచేసుకొనేందుకు మరింత సమయం పట్టనుందని మరమగ్గాల యజమానులు వాపోయారు. మరమ్మతులకు అయ్యే ఖర్చు ఎక్కడి నుంచి సమకూర్చుకోవాలో అర్ధం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బురద నిండుకున్న ఇళ్లు, పరిశ్రమలు శుభ్రం చేసుకోవడంతో పాటు దెబ్బతిన్న పరికరాలు సరిచేసుకుంటే తప్ప.. బతుకమ్మ చీరల ఉత్పత్తి ప్రారంభం కాదని కార్మికులు చెబుతున్నారు.
ఇదీ చూడండి: