GST on Handloom: చేనేత మగ్గాలను నమ్ముకున్న కార్మికుల జీవితాలు అస్తవ్యస్తంగానే ఉన్నాయి. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని వస్త్ర పరిశ్రమలో 35 వేల మరమగ్గాలు, 175 చేనేత మగ్గాలపై 5వేల మంది ప్రత్యక్షంగా, 30 వేల మంది కార్మికులు పరోక్షంగా ఉపాధిని పొందుతున్నారు. వ్యవసాయం తర్వాత అతిపెద్ద ఉపాధి రంగంగా ఉన్న వస్త్ర పరిశ్రమపై వేలాది కుటుంబాలు ఆధారపడి జీవితాలను వెళ్లదీస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా వస్త్ర విక్రయాలపై 5 శాతం ఉన్న జీఎస్టీని 12 శాతానికి పెంచాలని నిర్ణయించడంతో కార్మికుల ఉపాధిపై ప్రభావం పడనుంది. జనవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చే జీఎస్టీ ద్వారా చేనేత, మరమగ్గాలపై తయారయ్యే పెట్టీకోట్స్, టవల్స్, ఇతర ఉత్పత్తుల ధరలు పెరగనున్నాయి. ఒకవైపు జీఎస్టీ పన్ను, మరోవైపు నూలు ధర పెరుగుదలతో చేనేత కార్మికులు మరింత ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే పరిస్థితి నెలకొంది.
ధరలు పెరిగితే..
GST burden on Handloom industry: ఒకప్పుడు సిరిసిల్లలో రంగు రంగుల చీరలు, ధోవతులు, పంచెలతో కళకళలాడిన చేనేత మగ్గాల ఉనికి నేడు ప్రశ్నార్థకంగా మారుతుండగా.. జీఎస్టీ పిడుగుతో మిగిలి ఉన్న చేనేత మగ్గాలు సైతం మూలన పడే పరిస్థితి నెలకొంది. చేనేత మగ్గాలనే నమ్ముకుంటూ చీరలోని గొప్పతనాన్ని ప్రపంచానికి చాటుతూ అగ్గిపెట్టెలో సైతం అమరే చీరను తయారు చేసిన సిరిసిల్ల చేనేత మగ్గాన్ని వదలి మరమగ్గాల వైపు అడుగులు వేసింది. ధరలు పెరిగితే కొనుగోళ్లు తగ్గుతాయని.. దీనితో ఉత్పత్తిని తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వస్త్ర తయారీదారులు చెబుతున్నారు.
చాలా దారుణం..
టెక్స్టైల్స్ రంగానికి ప్రోత్సాహకాలు కావాలని కోరుతున్న తరుణంలో.. జీఎస్టీని 5శాతం నుంచి 12 శాతానికి పెంచడం చాలా దారుణం. ఇక్కడ ఉన్న చిన్న చిన్న టెక్స్టైల్ పరిశ్రమలన్నీ కూడా మూతపడే పరిస్థితి ఉంది. ఇందులో పనిచేస్తున్న కార్మికులు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఉంది. గత ఆరేడు మాసాల నుంచి బట్టలను తయారు చేసే దారం ధరలు 50 నుంచి 60 శాతం పెరిగాయి. దానివల్ల ఉత్పత్తిని తగ్గించాల్సిన పరిస్థితి ఉంది. -వస్త్ర తయారీ దారుడు
జీఎస్టీని తగ్గించాలి..
తెలంగాణలో ఉన్న వస్త్ర పరిశ్రమను కాపాడాలంటే జీఎస్టీని తగ్గించాలి. ఈ పరిశ్రమపై ఆధారపడిన కార్మికులను ఆదుకోవాలి. జీఎస్టీని తగ్గించి వస్త్ర పరిశ్రమను కాపాడాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. -వస్త్ర తయారీ దారుడు
జీఎస్టీతో మరిన్ని కష్టాలు
GST burden on Handloom: రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల, వేములవాడ, చందుర్తి, బోయినపల్లి, తంగళ్లపల్లి, ఇల్లంతకుంట, గంభీరావుపేట, కోనరావుపేటలో చేనేత కార్మికులు ఉపాధిని పొందుతున్నారు. ఇందులో సిరిసిల్లలో మహేశ్వర సొసైటీ, సిరిసిల్ల సొసైటీ, జగదాంబ సొసైటీ, వేములవాడ, హన్మాజీపేట, మామిడిపెల్లి సొసైటీతో పాటు ఖాదీ గ్రామోద్యోగ్, తంగళ్లపల్లి సొసైటీల్లో చేనేత మగ్గాలు కార్మికులకు ఉపాధిని అందిస్తున్నాయి. చేనేత మగ్గాలకు జియో ట్యాగింగ్ చేశారు. జీఎస్టీతో నూలు ధరపై పన్నులు, వస్త్ర విక్రయాలపై 12 శాతం పెరిగే పన్నుతో పరిశ్రమకు మరిన్ని కష్టాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు నూలు ధరలు కూడా రోజు రోజుకు పెరుగుతుండడంతో నేతన్నలు ఇబ్బందులు పడుతున్నారు. కరోనాతో దెబ్బతిన్న వస్త్ర పరిశ్రమ ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా... కేంద్రం నిర్ణయంతో మరోసారి కష్టాలు తప్పవని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కార్మికుల ఉపాధికి గండం
ఈ రోజు వరకు 15వందల నుంచి 2వేల వరకు కాటన్ పరిశ్రమలు నడుస్తున్నాయి. కేంద్రం జీఎస్టీని పెంచినట్లయిలతే అటు డైయింగ్ పరిశ్రమ దెబ్బతింటుంది. యారన్వాలాలు కూడా దెబ్బతింటారు. ఇక్కడున్న కార్మికులు కూడా ఉపాధిని కోల్పోతారు. కావున ఇప్పటివరకు ఉన్న జీఎస్టీని అలాగే ఉంచి వస్త్ర పరిశ్రమను కాపాడాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. -వస్త్ర వ్యాపారి
జీఎస్టీపై నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి..
కేంద్ర ప్రభుత్వం జీఎస్టీపై తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని వస్త్ర ఉత్పత్తిదారులు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే నిరసనలకు దిగుతామని హెచ్చరిస్తున్నారు.
ఇదీ చదవండి:
New GST Rates on handlooms: చేనేత మగ్గాలకు గడ్డు రోజులు.. వస్త్ర పరిశ్రమపై జీఎస్టీ బాదుడు