కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి భాగస్వామ్యంతో 2016లో రాజన్న సిరిసిల్ల జిల్లా మండేపల్లి వద్ద ఐడీటీఆర్ పనులు ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం వాటాగా రూ.16.48 కోట్లు కేటాయించగా.. రాష్ట్ర ప్రభుత్వం వంతుగా 20 ఎకరాల స్థలం అందించింది. రాష్ట్ర రవాణాశాఖ రూ.5 కోట్లు విడుదల చేసింది.
దక్షిణాదిన మూడు కేంద్రాలు
తరగతి గదులు, వసతిగృహ భవన నిర్మాణాలు.. శిక్షణా ట్రాక్‌ల పనులు పూర్తయ్యాయి. అశోక్ లేలాండ్ సంస్థ నిర్వహించే ఈ కేంద్రానికి కలెక్టర్ ఛైర్మన్‌గా ఉంటారు. జిల్లాలోని పది మంది ఉన్నతాధికారులతో కమిటీ పనిచేస్తుంది. దేశవ్యాప్తంగా పది చోదక శిక్షణ కేంద్రాలున్నాయి. దక్షిణాదిన తమిళనాడు, కర్ణాటకతో కలిపి తెలంగాణలో ప్రారంభిస్తే మూడోది అవుతుంది. ఇక్కడ ఒక విద్యార్థికి వసతితో పాటు.. చోదక శిక్షణ ఇవ్వాలంటే సగటున పదిహేను వేల నుంచి ఇరవై వేల రూపాయలు ఖర్చవుతుందని అంచనా. ఈ మొత్తాన్ని ప్రభుత్వమే భరించి, యువతకు శిక్షణనిచ్చేలా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీనికోసం ప్రభుత్వం పలు పథకాలను ప్రత్యేకంగా రూపొందిస్తోంది.
మరమ్మతులపై అవగాహన
ఐడీటీఆర్‌లో శిక్షణ ఇచ్చేందుకు డిజిటల్ తరగతి గదులు, ఐదు రకాల వాహనాలు అందుబాటులో ఉంచారు. 3.25 కిలోమీటర్ల పరిధిలో నాలుగు, ఆరు వరుసల రహదారులను నిర్మించారు. ట్రాఫిక్ నిబంధనలు వివరించేలా ఏర్పాట్లు చేశారు. తరగతులతో పాటు డిజిటల్ త్రీడీ డైవింగ్ శిక్షణకు ప్రత్యేక గది ఉంది. చోదకులు వాహనాలు నడుపుతూ మధ్యలో ఇబ్బందులు తలెత్తినపుడు అత్యవసర మరమ్మతులపై అవగాహన కల్పించేలా ప్రత్యేక వాహనాలు అందుబాటులో ఉంచారు.
ఏటా 4వేల మందికి శిక్షణ
భారీ, తేలికపాటి వాహనాల శిక్షణను 31, 21 రోజుల కాలపరిమితితో అందిస్తారు. శిక్షణ తరగతులకు ఒక్కో బ్యాచ్‌కు 30 మందికి అవకాశం ఉంటుంది. ఏటా సగటున నాలుగు వేల మంది చోదక శిక్షణ పొందే వీలుంది. పాఠ్యాంశాలు.. వాహనాలపై శిక్షణ ఇచ్చేందుకు ఆయా విభాగాల్లో అనుభవజ్ఞులైన అధ్యాపకుల కోసం అశోక్ లేలాండ్ సంస్థ నియామకాలు ప్రారంభించింది. ఈ నెలాఖరులోగా కోర్సుల ప్రణాళికలను విడుదల చేయనున్నారు. ఇక్కడ శిక్షణ పూర్తిచేసుకున్న వారికి అందించే ధ్రువీకరణ పత్రంతో రాష్ట్రంలో ఏ రవాణాశాఖ కార్యాలయం నుంచైనా లైసెన్సు పొందవచ్చు.
ఇదే మా ఉద్దేశం
రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలు వెతుక్కుంటూ ఇతర దేశాలకు వలస వెళ్తున్నారు. నైపుణ్యం కలిగిన చోదకులకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. ఐడీటీఆర్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో చోదక శిక్షణ అందిస్తారు. మార్చి ఆఖరులోగా కోర్సుల ప్రణాళికలు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఈ రంగంలో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు పరచడం.. రహదారి ప్రమాదాల నివారణ.. వాహనాలకు ఉపయోగించే ఇంధన వనరుల వినియోగాన్ని గణనీయంగా తగ్గించడం వంటివి ఈ శిక్షణా కేంద్రం ముఖ్య ఉద్దేశం.
- కొండల్ రావు, జిల్లా రవాణాశాఖ అధికారి
- ఇదీ చూడండి : 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'కు పెట్రోల్ బహుమతి