వలస కార్మికుని పట్ల దుబాయ్‌కి చెందిన కంపెనీ ఉదారతను చాటుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్‌కు చెందిన బత్తిని మల్లయ్య దుబాయ్‌లోని ప్రోస్కెప్ కంపెనీలో 19 ఏళ్లుగా పని చేస్తున్నాడు. ఇటీవల విధుల్లో ఉండగా మల్లయ్య పడిపోయాడు. వైద్య పరీక్షలు చేయగా... బ్రెయిన్ ట్యూమర్ అని తేలింది.
అప్పటి నుంచి మల్లయ్యకు దుబాయిలోనే రూ. 90 లక్షల ఖర్చుతో సదరు కంపెనీ యాజమాన్యం వైద్యం చేయించింది. ఆసుపత్రిలో సమీప బంధువులు లేరని... స్వస్థలానికి మల్లయ్యను పంపించాలని బాధిత కుటుంబ సభ్యులు కంపెనీని అభ్యర్థించారు.
అభ్యర్థనను మన్నించిన కంపెనీ యాజమాన్యం మల్లయ్యను స్వస్థలానికి పంపించాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ప్రభుత్వ అనుమతి లభించాల్సి ఉండగా... జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ లేఖ రాశారు. ఈ మేరకు ప్రోస్కెప్ కంపెనీ యాజమాన్యం బత్తిని మల్లయ్యను సొంత ఖర్చులతో ఎయిర్ అంబులెన్స్‌లో దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు పంపింది. ప్రస్తుతం మల్లయ్యకు హైదరాబాద్‌లో చికిత్స అందిస్తున్నారు.