KG TO PG in Telangana: తెలంగాణ రాష్ట్రంలో కేజీ టు పీజీ ఉచిత విద్య అందిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో గురుకుల పాఠశాలలు ఏర్పాటుచేశామని ప్రభుత్వం చెబుతోంది. ఐతే ఒకే చోట కేజీ టు పీజీ మాత్రం ఏర్పాటుకాలేదు. ఇప్పుడు సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేటలో ఏర్పాటుచేసిన విద్యాలయం కేజీ టు పీజీ విద్యకు నమూనాగా మారింది.
2021లో గంభీరావుపేటలో కేజీ టు పీజీ క్యాంపస్ ఏర్పాటుకు మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ చూపారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా రహేజా కార్ప్ ఫౌండేషన్ సహకారంతో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. రహేజా ఫౌండేషన్, మైండ్ స్పేస్, యశోద హాస్పిటల్, ఎంఆర్‌ఎఫ్ టైర్స్ సహా పలు కంపెనీలు కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద పాఠశాల అభివృద్ధికి నిధులు కేటాయించాయి.
ఆరు ఎకరాల్లో 3 కోట్ల రూపాయలతో కార్పొరేట్ సౌకర్యాలతో క్యాంపస్‌ను అభివృద్ధి చేశాయి. ప్రి ప్రైమరీ, ప్రైమరీ, హైస్కూల్, ఇంటర్, డిగ్రీ, పీజీ సహా మొత్తం 3వేల 500 మంది విద్యార్థులు తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ మూడు మాధ్యమాల్లో చదువుకునేలా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా విద్యాశాఖాదికారి రాధాకిషన్ తెలిపారు. నాలుగేళ్ల క్రితం శిథిలావస్థలో ఉన్న పాఠశాల ఇప్పుడు కార్పొరేట్ పాఠశాలను తలదన్నేలా రూపుదిద్దుకుంది.
250 మంది సామర్థ్యంతో అంగన్‌వాడీ కేంద్రంతో పాటు 70 తరగతి గదులు, ఆధునిక డిజిటల్ లైబ్రరీ, సైన్స్ ల్యాబ్, రోబోటిక్ ల్యాబ్, 50 కంప్యూటర్లతో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుచేశారు. వెయ్యిమంది కూర్చుకునేలా డైనింగ్ హాల్, ఇతర సౌకర్యాలు ఇదే క్యాంపస్‌లో ఉన్నాయి. ఆ ప్రాంగణంలో డిగ్రీ విద్యార్థుల కోసం బాలికల హాస్టల్‌ను కూడా నిర్మించారు.
4వేల 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునిక క్రీడా మైదానాన్ని తీర్చిదిద్దారు. అథ్లెటిక్ ట్రాక్‌తో పాటు, క్రికెట్, వాలీబాల్, ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్ కోర్టులు ఎఫ్ఐఎఫ్ఎస్ ప్రమాణాలతో అభివృద్ధి చేశారు. తాము ఆరో తరగతిలో చేరినప్పుడు పాఠశాల శిథిలావస్థలో ఉండేదని, ఇప్పుడు ప్రతి ఒక్కరు అసూయపడేలా తీర్చిదిద్దారని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. కార్పొరేట్ స్థాయిలో నిర్మాణం పూర్తి చేసుకున్న పాఠశాలలో ఇప్పటికే తరగతులు కొనసాగుతున్నాయి. మంత్రి కేటీఆర్ ప్రారంభించిన తర్వాత మరిన్ని సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.
ఇవీ చదవండి: