Competition for BRS Mla Ticket in Vemulawada : రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడలో రాజకీయం వేడెక్కుతుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే రమేష్ బాబుకు చల్మెడ లక్ష్మీనర్సింహారావుకు మధ్య తీవ్ర వివాదం నడుస్తుండటం విధితమే. ఈ అంశం ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల అదే నియోజకవర్గంలో నూతన కార్యాలయాన్ని చల్మెడ ప్రారంభించారు. ఇది తన వ్యక్తిగతమని చెబుతున్నా... పార్టీ కార్యాలయం ఓపెనింగ్ కార్యక్రమానికి చాలా మంది బీఆర్ఎస్ నాయకులు అభిమానంతో హాజరయ్యారని ఆయన చెప్పడం.... రాజకీయంగా చర్చకు దారితీసింది.
Political war between Chalmeda and Chennamaneni : చల్మెడ వైద్య విద్యాసంస్థల ఛైర్మన్‌గా.... పార్టీ అధిష్టానం ఆదేశిస్తే తప్పకుండా వేములవాడ ప్రజలకు సేవ చేస్తానంటూ.. ఇంతకాలం జరుగుతున్న ప్రచారాన్ని తన నోటే నిజం చేస్తూ మరో మారు చల్మెడ కుండబద్ధలు కొట్టారు. అవకాశం ఇస్తే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటూ చల్మెడ ప్రారంభోత్సవ ప్రకటన చేశారు. దీంతో ఇప్పుడు వేములవాడలో రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయనే చర్చ జరుగుతోంది. తానిప్పటికే పలు సేవా కార్యక్రమాలు చేపట్టానని.. తానూ వేములవాడ నియోజకవర్గ వాసినేనంటూ చల్మెడ చేసిన కామెంట్స్ ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి.
'రాజకీయాల్లో ఉన్నప్పుడు తప్పకుండా అవకాశం వస్తే పోటీ చేస్తా. దాని కోసమే సేవా కార్యక్రమాలు చేస్తున్నాను అని ఎవరైనా ఆలోచిస్తే అది అపోహ మాత్రమే. ఎక్కడైనా సరే దిల్లీకి రాజైనా తల్లి కొడుకు అన్నట్లు గ్రామీణ ప్రాంతాలలో పుట్టి బయటకు వెళ్లి ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగినా పుట్టిన ఊరును మర్చిపోవద్దు. ఆ ఉద్దేశంతోనే మా గ్రామంలో పలు సేవా కార్యక్రమాలు, అభివృద్ధి పనులు చేపడుతున్నాను.'-చల్మెడ లక్ష్మీనర్సింహారావు, చల్మెడ వైద్య విద్యాసంస్థల ఛైర్మన్
ఎమ్మెల్యే టికెట్ తనకే అంటూ చెన్నమనేని ధీమా : సేవా కార్యక్రమాల పేరుతో... ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తూ నియోజకవర్గంలోని ప్రజల్లోకి నిదానంగా వెళ్తున్నారు చల్మెడ లక్ష్మీనర్సింహారావు. రమేష్ బాబు ద్వంద్వ పౌరసత్వ వివాదం కూడా కొనసాగుతున్న తరుణంలో... అధిష్ఠానం నుంచి స్పష్టమైన సంకేతాలు అందుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే చల్మెడ చక్రం తిప్పేందుకు సిద్ధమవుతున్న క్రమంలో.. సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు మాత్రం సిట్టింగ్‌లకే టికెట్ ఇస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారని చెబుతున్నారు. అంతేకాకుండా ప్రతి వారం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తనతో టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారని టికెట్ తనకు దక్కడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో తమకే టికెట్ వస్తుందన్న ధీమాతో ఇరువురు నేతలు ముందుకు సాగుతున్నారు. టికెట్‌ను ఆశిస్తున్న చల్మెడ లక్ష్మీనర్సింహారావు తన సామాజిక సేవను మరింత విస్తరిస్తున్నారు.
'టికెట్ల విషయం గురించి మా పార్టీలో అభ్యర్థి ఎప్పుడు మాట్లాడరు. సీఎం కేసీఆర్ సిట్టింగ్‌లందరికీ టికెట్లు ఇస్తానన్నారు. ఎవరికైనా టికెట్ ఇవ్వని పరిస్థితిలో ఉన్నట్లయితే వారిని పిలిచి మాట్లాడుతానన్నారు. నాకు అలాంటి పిలుపు అయితే ఏమి రాలేదు. రాష్ట్రం కోసం పోరాడాను. ఇక్కడి ప్రజలు నన్ను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. దశాబ్ది ఉత్సవాలు జరుపుతున్న సందర్భంలో ఎవరైనా టికెట్లు గురించి మాట్లాడితే అపచారం అవుతుంది. రెండు రోజులకోసారి కేటీఆర్ ఆడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. టికెట్ విషయంలో పార్టీనే కీలక నిర్ణయం తీసుకుంటుంది.'-చెన్నమనేని రమేశ్‌బాబు, వేములవాడ ఎమ్మెల్యే
రాబోయే ఎన్నికల్లో తమకే టికెట్ వస్తుందన్న ధీమాతో ఇరువురు నేతలు ముందుకు సాగుతున్నారు. టికెట్‌ను ఆశిస్తున్న చల్మెడ లక్ష్మీనర్సింహారావు తన సామాజిక సేవను మరింత విస్తరిస్తున్నారు. వేములవాడ నుంచి టికెట్ ఆశిస్తున్న చల్మెడతో పాటు ఏనుగు మనోహర్‌రెడ్డిలు ఎలాంటి విభేదాలు రాకుండా పూర్తి అవగాహనతో ముందుకు సాగుతున్నట్లు చర్చ జరుగుతోంది.
ఇవీ చదవండి: