రాష్ట్రప్రభుత్వం నాలుగేళ్ల నుంచి ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తోంది. ఇందుకు సంబంధించిన తయారీని సిరిసిల్ల మరమగ్గ కార్మికులకు అప్పగించింది. ఏటా ఐదు నుంచి ఆరునెలల పాటు బతుకమ్మ చీరల ఉత్పత్తి ప్రక్రియ కొనసాగుతుండగా....అనంతరం ఇతర ప్రభుత్వ ఆర్డర్లు తయారు చేస్తున్నారు. ప్రస్తుతం తమిళనాడు చీరలు రూపొందించేందుకు కార్మికులు నడుం బిగించారు.
80కోట్లు కూలీలకే చెల్లిస్తున్నారు
చీరల తయారీ ద్వారా ఒక్కో కార్మికుడు నెలకు 15 నుంచి 20 వేల రూపాయల వరకు కూలీ పొందుతున్నారు. గణాంకాల ప్రకారం చూస్తే.. ఏటా చీరలపై వెచ్చించే ఖర్చులో దాదాపు 80కోట్లు కూలీలకే చెల్లిస్తున్నారు. ఈ లెక్కన నాలుగేళ్లలో 320 కోట్లు అందించారు. మరోవైపు ఇందుకు అనుబంధంగా ప్యాకింగ్, ట్రాన్స్‌పోర్టు ద్వారా మరో 15 వేల మందికి లబ్ధి చేకూరుతోంది. గతంలో ముంబై, భీవండికి ఉపాధి కోసం వెళ్లిన ఎంతోమంది కార్మికులు.... తిరిగి సొంత ప్రాంతాలకు చేరుకుంటున్నారు. తమ జీవితాల్లో గణనీయమైన మార్పు వచ్చిందని కార్మికులు చెబుతున్నారు.
ఈసారి బంగారం, సిల్వర్, జరీతోపాటు 225 రకాల చీరలు
బతుకమ్మ పండుగ సందర్భంగా చీరలు అందించాలని నిర్ణయించిన ప్రభుత్వం....ప్రతి ఏడాది కోటి చీరలను పంపిణీ చేస్తోంది. 2018,19లో వంద రకాల డిజైన్లతో వందశాతం చీరలను సిరిసిల్లలోనే ఉత్పత్తి చేయగా... ఈసారి బంగారం, సిల్వర్, జరీతోపాటు 225 రకాల చీరలు ఉత్పత్తి చేసి జిల్లాలకు పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే 97 శాతం పూర్తయ్యిందన్న అధికారులు....ఇందుకోసం ప్రభుత్వం 350 కోట్లను ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. బతుకమ్మ చీరల తయారీ పూర్తి కావడంతో.... సంక్రాంత్రికి తమిళనాడు ప్రభుత్వం పంపిణీ చేసే చీరలను సిరిసిల్లలోనే ఉత్పత్తి చేస్తున్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో 7 లక్షల చేరువలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు...