Army Jawan Anil Last Rites in Sircilla : భారత సైన్యానికి చెందిన తేలిక పాటి ధ్రువ్ హెలికాప్టర్ గురువారం ఉదయం ప్రమాదానికి గురైన ఘటనలో రాజన్న సిరిసిల్ల జిల్లా మల్కాపూర్‌కు చెందిన జవాన్ అనిల్ ప్రాణాలు కోల్పాయారు. 11 ఏళ్ల క్రితం ఆర్మీలో చేరిన అనిల్.. సీఎఫ్‌ఎన్ ఏవీఎన్ టెక్నీషియన్‌గా పని చేసేవారు. బోయినపల్లి మండలం కోరెం గ్రామానికి చెందిన సౌజన్యతో ఎనిమిదేళ్ల కిందట వివాహం కాగా వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.
నెల రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చిన అనిల్.. పది రోజుల క్రితం తిరిగి విధులకు వెళ్లి.. ప్రమాదవశాత్తు జరిగిన దుర్ఘటనలో అమరుడయ్యారు. దేశ రక్షణలో భాగంగా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన అనిల్ పార్థివ దేహాన్ని హైదరాబాద్ నుంచి మల్కాపూర్‌కు తరలిస్తుండగా.. మార్గమధ్యలో జనం నివాళులు అర్పించారు. గంగాధర నుంచి భారీ జన సందోహం మధ్య మల్కాపూర్‌కు తరలించారు. అనిల్ మృతదేహాన్ని చూసి భార్య, ఇతర కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. వీరి రోదనలు చూసి స్థానికులు కదిలిపోయారు.
జవాన్ అంతిమ కార్యక్రమాలకు మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ బండి సంజయ్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్ తదితరులు హాజరై నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన అంతిమ యాత్రలో దారిపొడవునా ప్రజలు నివాళులు అర్పించారు. చితికి అనిల్ కుమారుడు నిప్పంటించగా.. సైనిక లాంఛనాల మధ్య అనిల్ అంత్యక్రియలు ముగిశాయి.
Army jawan dies in helicopter accident : అనిల్ పార్థివదేహాన్ని చూసి స్నేహితులు చలించిపోయారు. పది రోజుల వరకు తమతో ఎంతో సంతోషంగా గడిపి విధులకు వెళ్లాడని.. ఇంతలో తిరిగి మృతదేహమై వచ్చాడని కన్నీరుమున్నీరుగా విలపించారు. తోటి యువతకు ఏ అవసరం వచ్చినా సహాయం చేసేవాడని.. యువత సైన్యంలో చేరడానికి ఎంతో ప్రోత్సహించేవాడని స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు. తమ తోటి స్నేహితుడిని కడసారి చూసేందుకు గ్రామంలో యువతతో పాటు పక్క గ్రామాలకు చెందిన యువత పెద్ద ఎత్తున తరలివచ్చి జవాన్‌కు నివాళులు అర్పించారు.
ప్రమాదం ఎలా జరిగిందంటే..?: జమ్మూకశ్మీర్‌లోని కిశ్త్‌వాడ్ జిల్లా అటవీ ప్రాంతంలో గురువారం భారత సైన్యానికి చెందిన ధ్రువ్ హెలికాప్టర్ సాంకేతిక లోపం తలెత్తడంతో.. దించేందుకు ప్రయత్నిస్తుండగా కుప్పకూలిపోయింది. మరువా నదీ తీరాన క్షతగాత్రులను, హెలికాప్టర్ శకలాలను స్థానికులు గుర్తించారు. దీంతో వారు ఆర్మీ సిబ్బందికి సమాచారం ఇవ్వగా రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. వారికి చుట్టుపక్కల గ్రామాల వారూ ఎంతో సహాయం చేశారు. హెలికాప్టర్ ప్రమాదంలో సిరిసిల్ల జిల్లాకు చెందిన సాంకేతిక నిపుణుడు పబ్బాల అనిల్(29) మృతి చెందగా.. మరో ఇద్దరు గాయాలపాలయ్యారు.
ఇవీ చదవండి:
Sircilla Jawan Death: హెలికాప్టర్ క్రాష్‌లో సిరిసిల్ల జవాన్ మృతి.. కేటీఆర్ సంతాపం
జమ్ముకశ్మీర్‌లో ఎన్కౌంటర్లు.. ఉగ్రవాదుల 'దొంగదెబ్బ'కు రివెంజ్!.. ఇద్దరు ముష్కరులు హతం
'ఉగ్రవాదానికి కాంగ్రెస్ అండ.. కేరళ స్టోరీ చిత్రానికీ వ్యతిరేకం.. మూల్యం తప్పదు!'