రోజుల తరబడి ఇళ్లకే పరిమితమైన మహిళలు ఉపాధి హామీ పనులకు ఉత్సాహంతో వెళ్లుతున్నారు. పని ప్రదేశాల్లో అరకొర సౌకర్యాలు ఉన్నప్పటికీ కష్టిస్తున్నారు. సాగునీటి వనరులు, భూగర్భజలాలు పెంపొందించే పనుల్లో చురుకుగా తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలోని 13 మండలాల్లో 45,382 కుటుంబాల్లోని 43,494 మంది మహిళలు, 23,170 పురుషులు రోజు వారీగా పనుల్లో పాల్గొంటున్నారు. మగవారితో సమానంగా శ్రమిస్తూ..వేతనాలు పొందుతున్నారు.
బహుళ ప్రయోజనాల పనుల ఎంపిక
గ్రామాల్లో గతంలో కంటే భిన్నంగా ప్రజలకు బహుళ ప్రయోజనాలు చేకూర్చే పనులను గుర్తించారు. వీటికి సంబంధించి ప్రజల సమక్షంలో గ్రామసభలు నిర్వహించి ఆమోదముద్ర వేశారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 14,934 పనుల లక్ష్యంగా రూ.44,836.92 లక్షల వ్యయం అంచనాతో అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. వీటిల్లో ఇప్పటి వరకు రూ. 136.64 లక్షలతో 179 పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులు ప్రగతిలో ఉన్నాయి. ఇప్పటివరకు రూ.1134.94 లక్షలు కూలీలకు సంబంధించి, రూ.155.73 లక్షల మేర సామగ్రి వాటాగా పనులు చేశారు.
మొక్కవోని ధైర్యం
ఉపాధిహామీ పథకం పనుల్లో మహిళల నమోదు ఆదర్శంగా నిలుస్తోంది. వాస్తవంగా పురుషుల నమోదు ఎక్కువగా ఉన్నప్పటికీ పనుల ప్రగతిలో అతివలు ముందుంటున్నారు. ఆత్మవిశ్వాసం నింపుకుని చెరువులు, కాలువలు, నీటి సంరక్షణ పనులైన కాంటూరు, సమతల కందకాల పనులు చేస్తున్నారు. మగవారితో సమానంగా మొక్కవోని ధైర్యంతో పార, పలుగు పట్టి చెమటోడ్చుతున్నారు. మెరుగైన కూలీ వేతనాలు పొందుతూ కుటుంబ పోషణ భారాన్ని తమ భుజాలపై వేసుకుంటున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఉచితంగా మాస్కులు పంపిణీ చేయాలని మహిళలు కోరుతున్నారు.
కుటుంబ పోషణ ముఖ్యం -
శ్యామల, హన్మంతునిపేట, పెద్దపల్లి మండలం
మా ఊరిలో జరిగే పనులకు మహిళమందరం కలిసి వెళ్లుతున్నాం. శ్రమకు తగ్గ ప్రతిఫలం అందుతుంది. చెరువుల పూడిక, ఇతర పనులను చేస్తున్నాం. కూలీ వేతనాలతో కుటుంబపోషణలో మావంతు ప్రయత్నిస్తున్నాం.