పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ పోలీసులు అకారణంగా తమపై దాడికి పాల్పడ్డారంటూ ఐదుగురు యువకులు తెలిపారు. ఈ నెల 4న ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ గెలుపొందిన సందర్భంగా కార్యకర్తలు టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ ఘటనపై 5న బసంత్ నగర్ ఠాణాలో తెరాస నేతలు ఫిర్యాదు చేశారు. జూన్ 12న పోలీసులు జయ్యారం గ్రామానికి చెందిన సాగర్, అనిల్, మల్లయ్య, శివకుమార్, అనిల్లను ఇంట్లో నుంచి తీసుకెళ్లి విచారించకుండానే చితకబాదినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ నేతల సహకారంతో రాత్రి జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. పోలీసులు చేసిన గాయాలను చూపించి ఆందోళన వ్యక్తం చేశారు. విచారణ జరపకుండానే తమపై దాడికి పాల్పడిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.
ఈ ఘటనపై స్పందించిన రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ బసంత్ నగర్ ఎస్ఐ ఉమా సాగర్ను కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం ఘటనపై పూర్తి విచారణ జరపాలంటూ పెద్దపల్లి డీసీపీ సుదర్శన్ గౌడ్ ఆదేశాలు జారీ చేశారు.
ఇవీ చూడండి : భట్టి దీక్షతో బయటపడ్డ విభేదాలు