Wife Killed Husband Using Snake Peddapalli : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మార్కండేయకాలనీకి చెందిన స్థిరాస్తి వ్యాపారి, బిల్డర్ కొచ్చెర ప్రవీణ్ హత్య కేసు మిస్టరీ వీడింది. వివాహేతర సంబంధం(Extramarital Affair) వల్ల అతని భార్యే హత్య చేసేందుకు పథకం రచించింది. అతడ్ని చంపేందుకు మరో వ్యక్తికి చెప్పగా.. ఆ వ్యక్తి మరి నలుగురు వ్యక్తుల సాయంతో హత్య చేశారు. అనంతరం ఆమె గుండెపోటుతో చనిపోయడని అందర్ని నమ్మించింది. చివరికి పోలీసులు ఈ కేసును చేధించి.. అసలు నిందితులను పట్టుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మార్కేండేయ కాలనీకి చెందిన స్థిరాస్తి వ్యాపారి, బిల్డర్ కొచ్చెర ప్రవీణ్ (42) లలితను వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. గత కొన్ని రోజులుగా ప్రవీణ్ ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న లలిత.. భర్తతో రోజూ గొడవ పడేది. ఎన్నిసార్లు చెప్పిన భర్తలో మార్పు రాలేదు. దీంతో చంపాలని నిర్ణయించుకుంది.
Builder Praveen Murder Case Details : లలిత తన భర్తను చంపాలని అనుకున్న విషయాన్ని ప్రవీణ్ వద్ద సెంట్రింగ్ పనులు నిర్వహించే రామగుండం హౌసింగ్‌బోర్డు కాలనీకి చెందిన మచ్చ సురేశ్ (37)తో చెప్పింది. ప్రవీణ్‌ను హత్య చేస్తే ఒక ప్లాట్ బహుమతిగా ఇస్తానని చెప్పి.. ఒప్పించింది. దీనికి అంగీకరించిన సురేశ్.. మందమర్రికి చెందిన మాస శ్రీనివాస్(33), భీమ గణేశ్(23), రామగుండానికి చెందిన ఇందారపు సతీశ్(25)లతో కలిసి హత్యకు పథకం వేశాడు. ఈ క్రమంలో ప్రవీణ్‌ని పాముకాటు(Snake Bite)కు గురిచేద్దామని అనుకుని.. మందమర్రిలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు నన్నపురాజు చంద్రశేఖర్(38)తో మాట్లాడుకున్నారు. దీనికి అయిన ఖర్చుల కోసం లలిత 34 గ్రాముల బంగారు గొలుసును వారికి ఇచ్చింది. ఈ నెల 9న రాత్రి రామగుండంలో మద్యం తాగిన నిందితులు.. లలితతో ఫోన్‌లో మాట్లాడి ద్విచక్ర వాహనాలపై ఇంటికి చేరుకున్నారు.
Wife Killed Husband with Help Some People : పడుకున్న ప్రవీణ్‌ను చూపించి లలిత మరో గదిలోకి వెళ్లి వేచిచూసింది. నిందితులు ప్రవీణ్ ముఖంపై దిండుతో అదిమిపట్టారు. కొద్దిసేపు పెనుగులాడిన ప్రవీణ్‌లో కదలిక నిలిచిన తర్వాత వెంట తెచ్చిన పాముతో కాటు వేయించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం పామును బహిరంగ ప్రదేశంలో వదిలేశారు. గుండెపోటు(Heart Attack)తో చనిపోయాడని లలిత చెప్పిన మాటలను నమ్మని ప్రవీణ్ తల్లి.. తన కుమారుడి మృతిపై అనుమానం ఉందని ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు. దర్యాప్తులో నమ్మలేని నిజాలు బయటకి వచ్చాయి. లలితతో పాటు మరో ఐదుగురి నిందుతులను అరెస్ట్ చేశారని డీసీపీ వైభవ్ గైక్వాడ్ తెలిపారు. నిందితుల దగ్గర నుంచి 34 గ్రాముల బంగారు గొలుసు, ఆరు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారని వెల్లడించారు.