పెద్దపల్లి జిల్లా మంథనిలోని ఉర్దూ మీడియం పాఠశాలలో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. పూర్తిస్థాయిలో తరగతి గదులు లేకపోవడం వల్ల ఒకే గదిలో విద్యార్థుల మధ్యలో తెరలు కట్టి విద్యాబోధన నిర్వహిస్తున్నారు.
2 గదులు.. 7 తరగతులు..
ఒకటి నుంచి ఏడో తరగతులకు రెండు గదులు మాత్రమే ఉన్నాయి. దీనికి తోడు 9వ తరగతి వరకు బోధన చేయాలని ఆదేశాలు వచ్చిన గదుల కొరతతో ఆ దిశగా అడుగులు వేయలేకపోతున్నారు. కొన్ని సంవత్సరాలుగా ఈ సమస్య ఉన్నప్పటికీ... అధికారులు, పాలకులు ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ప్రస్తుతం ఈ పాఠశాలలో ఇరువురు టీచర్లు ఒకేసారి విద్యను బోధించే సమయంలో విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు.
కనీస సౌకర్యాలు కరువు
మండల పరిషత్ యుపీఎస్ పాఠశాల అయినప్పటికీ కనీస సౌకర్యాలు కరువయ్యాయి. విద్యారంగంలో అనేక మార్పులు తీసుకొస్తున్న ఈ క్రమంలో కనీసం ఈ పాఠశాల్లో టాయిలెట్లు, మరుగుదొడ్లు కూడా నిర్మించలేదు. వసతులు లేకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
41 మంది విద్యార్థులు.... ఒక టీచర్...
ఈ విద్యా సంవత్సరం 41 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అయితే గత సంవత్సరం ఆరుగురు ఉపాధ్యాయులు ఈ పాఠశాలలో ఉండగా, విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని వారిని ఇతర పాఠశాలలకు బదిలీ చేశారు. ఈ విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయుడికి ఇన్ఛార్జీ బాధ్యతలు అప్పగించి, ఇద్దరు విద్యావాలంటీర్లను నియమించారు. కాగా గత పది రోజుల క్రితం నూతన ఉపాధ్యాయుల నియామకాల్లో భాగంగా ఈ పాఠశాలకు ఓ ఉపాధ్యాయురాలిని నియమించారు. ప్రస్తుతం ఆమెతో పాటు మరో ఇద్దరు విద్యా వాలంటీర్లు విద్యను బోధిస్తున్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యలపై స్పందించాలని విద్యార్థులు, అక్కడి ఉపాధ్యాయులు వేడుకుంటున్నారు.
ఇవీ చూడండి: బీమా పత్రాలు కాదు... ఇక నుంచి ఎస్సెమ్మెస్‌లు...!