పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రత్నాపూర్ గ్రామంలో స్వచ్ఛ పనులను పాలనాధికారి సిక్తా పట్నాయక్ పరిశీలించారు. స్వచ్ఛ శుక్రవారం కార్యక్రమంలో పాల్గొని అధికారులకు పలు సూచనలు చేశారు. గ్రామంలోని వాడవాడలో తిరుగుతూ ప్రజలను మురికి కాలువలు, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్త
తడి, పొడి చెత్తను వేరుగా ఉంచాలని, నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే ఆస్కారం ఉన్నందున అందరూ జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. అనంతరం కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించి అక్కడ ప్రయోగాలు చేస్తూ పండిస్తున్న పంటలు, మొక్కలను పరిశీలించారు. రైతులకు ఆధునిక వ్యవసాయ సాగు పద్ధతులు నేర్పాలని ప్రొఫెసర్లకు సూచించారు.
నిబంధనలు పాటించాలి
కరోనా వైరస్ పట్ల ప్రతిఒక్కరు అప్రమత్తంగా ఉండాలని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన నియమాలు తప్పనిసరిగా పాటించాలని సిక్తా పట్నాయక్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: కరోనా మహమ్మారికి చిక్కి పలువురు అధికారులు ఉక్కిరిబిక్కిరి