యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీయడంతో పాటు, క్రీడకారులకు ప్రోత్సహం అందించాలన్న లక్ష్యంతో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని జవహర్ లాల్ నెహ్రూ క్రీడా మైదానంలో విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం.. కోరుకంటి ప్రీమియర్ లీగ్ కేటీఆర్ గోల్డ్ కప్ క్రికెట్ పోటీలను ఎమ్మెల్యే చందర్ ప్రారంభించారు.
ఆటలతో ఉపాధి
యువత క్రీడల పట్ల మక్కువ పెంచుకోవాలని... ఆటల్లో తమ ప్రతిభను చాటి ఉన్నతంగా ఎదగాలని ఎమ్మెల్యే సూచించారు. విద్యతో పాటు క్రీడలను కూడా అలవరుచుకోవడం ఎంతో ముఖ్యమని తెలిపారు. క్రీడల్లో రాణిస్తే ఉద్యోగాలు పొందే అవకాశాలుంటాయని వెల్లడించారు. క్రికెట్ పోటీల్లో రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్లు, మండల పరిధిలోని 23గ్రామాల చెందిన 54 జట్లు పాల్గొంటున్నాయి.
విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజేత జట్టుకు రూ. 50వేల 116, రన్నరప్‌కు రూ.25వేల 116 బహుమతిగా అందిస్తామని వివరించారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు ఫౌండేషన్ ద్వారా ఉచితంగా టీ షర్ట్స్‌ను అందిస్తున్నామని తెలిపారు. మొదటి రోజు జరిగిన 14వ డివిజన్, కాకతీయ కళాశాల జట్ల మధ్య జరిగిన పోటీలో 14వ డివిజన్ జట్టు విజయం సాధించింది. ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగీ అనిల్ కుమార్, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'ప్రజలకు, పోలీసులకు మధ్య సత్సంబంధాలు మెరుగుపడాలి'