బెంగళూరు నుంచి హజరత్ నిజాముద్దీన్ వెళుతున్న రాజధాని ఎక్స్‌ప్రెస్ డ్రైవర్ సమయస్ఫూర్తితో ఓ నిండు ప్రాణం దక్కింది. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం కుందన్‌పల్లి రైల్వేగేటు వద్ద ఘటన చోటు చేసుకుంది. రామగుండం సెక్షన్‌లో కీమెన్‌గా పనిచేస్తున్న దుర్గయ్య తన విధుల్లో భాగంగా ట్రాక్ తనిఖీ చేసుకుంటూ పనిలో నిమగ్నమయ్యాడు. అయితే అదే మార్గంలో వస్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను గమనించలేదు. రైలు డ్రైవర్ పదే పదే హారన్ మోగిస్తున్నా దుర్గయ్య వినిపించుకోలేదు. దుర్గయ్య ప్రాణాలకు ముప్పు ఉందని గమనించిన లోకోపైలట్ బ్రేక్ వేశారు. అప్పటికే దుర్గయ్యను ఇంజిన్ ఢీ కొనగా నాలుగు బోగీలు అతనిపై నుంచి వెళ్లాయి. ఈ దుర్ఘటనలో దుర్గయ్య కాలు విరిగింది. రైల్వే సిబ్బంది హుటాహుటిన బోగీల కింద ఇరుక్కుపోయిన అతన్ని వెలికితీసి గోదావరిఖని ఆసుపత్రికి తరలించారు. ఆయనకు ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. సమయానికి రైలు ఆపిన రాజధాని ఎక్స్‌ప్రెస్ డ్రైవర్ను పలువురు అభినందించారు.
ఇదీ చూడండి : మంథని ప్రధాన రహదారిపై కారు దగ్ధం