పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కలవచర్లలో కృషి విజ్ఞాన కేంద్రం రామగిరిఖిల్లా ఆధ్వర్యంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, మహిళా రైతులకు పెరటి తోటలు పెంచే విధానం, యాజమాన్య పద్ధతులు, నమూనాలు, వాటి వల్ల లభించే పోషక విలువలు, వాటి ప్రాముఖ్యత గురించి శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా పరిషత్ ఛైర్మన్ పుట్ట మధుకర్ విత్తన ప్యాకెట్లను అందజేశారు.
ప్రతి అంగన్వాడీ సెంటర్లో పెరటి తోటలు విధిగా పెంచాలని, వాటితో అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లలకు పౌష్టికాహారం అందించాలని పుట్ట మధుకర్ సూచించారు. వీలైనంత వరకు మనమే కూరగాయలు, పండ్లు, ధాన్యాలను పండించుకుని తిని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. ఈ సంవత్సరం జిల్లా పరిషత్‌కు వచ్చే నిధులను అంగన్వాడీ సెంటర్లలో ఫర్నీచర్ సౌకర్యాలను పెంపొందించడానికి ఉపయోగిస్తామని తెలిపారు.