పెద్దపల్లి, జగిత్యాల, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి అనుసంధానంగా ఉన్న పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 1835 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. ఇందులో 307 కేంద్రాలు అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. పోలింగ్ కోసం పదివేల మందికి పైగా సిబ్బందిని నియమించినట్లు జిల్లా పాలనాధికారి శ్రీ దేవసేన తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సాయంత్రం 5 గంటలకే పోలింగ్ పూర్తి కానుండగా... మంథనిలో 4 గంటల వరకే ఓటు వేయడానికి అనుమతిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఓటర్లు ఇలా..
పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా మొత్తం 14,78,062 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో పురుష ఓటర్లు 7,39,633 మంది కాగా.. మహిళా ఓటర్లు 7,38,346 ఉన్నారు.
భద్రత కట్టుదిట్టం
పోలింగ్ నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 3000 మంది పోలీసులతో భద్రత కల్పించారు. రామగుండం సీపీ సత్యనారాయణ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
బరిలో 17 మంది
పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా మొత్తం 17 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధాన పార్టీలైన తెరాస నుంచి బోర్లగుంట వెంకటేశ్, కాంగ్రెస్ తరఫున ఆగం చంద్రశేఖర్, భాజపా నుంచి ఎస్ కుమార్ పోటీ పడుతున్నారు.
పోలింగ్ శాతం పెంచేలా చర్యలు
గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఓటింగ్ శాతం పెరిగేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు కలెక్టర్ దేవసేన తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ప్రజలు నిర్భయంగా ఓటెయ్యాలని సూచించారు.
ఇదీ చదవండి : పంతంగి టోల్గేట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్