సాగు చేసిన వరి పొలంలో మట్టి కుంగి గుంత ఏర్పడిన ఘటన ఓదెల మండలంలో సోమవారం చోటు చేసుకుంది. పెద్దపల్లి జిల్లాలోని ఓదెల మండలంలోని హరిపురం గ్రామంలోని ఈద పెద్ద ఓదెలుకు చెందిన వ్యవసాయ భూమిలో నూనె ఐలేష్ అనే కౌలు రైతు వరిపొలం సాగు చేపట్టారు. ఇటీవల పొలం దున్ని నాట్లు కూడా వేశారు.
ఇదిలా ఉంటే సోమవారం పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన ఐలేష్‌కు ఓ మడిలో మీటరు వెడల్పు, రెండు మీటర్ల లోతులో పెద్దపాటి గుంతపడి ఉండటాన్ని చూసి భయాందోళనకు గురయ్యారు.
సోమవారం నీరు పెట్టేందుకు పొలానికి వచ్చాను. పొలం మధ్యలో తేడాగా అనిపించింది. దగ్గరకు వచ్చి చూసే సరికి భూమి లోపలికి దిగిపోయింది. భయంతో చుట్టుపక్క వారిని పిలిచాను. అటుగా వెళ్తే ఇంకా భూమి లోపలకి వెళ్తుందేమోనని భయంగా ఉంది. అధికారులు వచ్చి పరిశీలించాలని కోరుతున్నాను.
-నూనె ఐలేష్, కౌలు రైతు
ఈ విషయాన్ని స్థానికులు తెలుసుకుని గుంతను చూసేందుకు తరలివచ్చారు. గతంలో అక్కడ ఎలాంటి బావి, ఇతర నిర్మాణాలు లేవని, ఏ కారణంతో గుంత ఏర్పడిందనే విషయం తెలియాల్సి ఉంది.
ఇదీ చూడండి: Adilabad Forest: పచ్చదనం పరుచుకున్న అడవుల ఖిల్లా... మైమరిపిస్తున్న అందాలు