పెద్దపల్లి జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద జలదీక్షకు వెళ్తున్న పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావును పెద్దపల్లి పోలీసులు గృహ నిర్భంధంలో ఉంచారు. విజయ రమణారావు అరెస్టును అడ్డుకోవడానికి వచ్చిన కార్యకర్తలను సైతం పోలీసులు అరెస్టు చేశారు. టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జలదీక్షను పోలీసులు ఎక్కడికక్కడా అడ్డుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గోదావరి నదిపై చేపట్టి పూర్తి కాకుండా ఉన్న ప్రాజెక్టులను సందర్శించి వాటి పరిస్థితిని ప్రస్తుత తెరాస ప్రభుత్వం ఎలా నిర్లక్ష్యం చేస్తుందో తెలియజేసేందుకు కాంగ్రెస్ చేపట్టిన జలదీక్షను పోలీసులు అడ్డుకోవడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముందస్తుగా కాంగ్రెస్ నేతలను అరెస్టు చేయడం టీఆర్ఎస్ పార్టీ చేతకానితనమని కాంగ్రెస్ నేతలు అన్నారు. రాష్ట్రంలో బలమైన ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ నేతలను అణచివేసే దిశగా తెరాస ప్రభుత్వం ప్రవర్తిస్తున్నదని, కాంగ్రెస్ పార్టీ నాయకులు జలదీక్ష చేస్తే తెరాస ప్రభుత్వం ఎందుకు భయపడుతుందంటూ విజయ రమణారావు ప్రశ్నించారు.
ఇదీ చదవండి: ఈనెల 17న జగన్, కేసీఆర్తో ప్రధాని భేటీ