పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సంగీత సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం పోలిస్ పరేడ్ గ్రౌండ్ సమీపంలో నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్ నిర్మాణ పనులను ఆమె పరిశీలించారు. ఎస్సారెస్పీ క్యాంపు కార్యాలయ పరిధిలోని 24 ఎకరాల్లో రూ. 48.7 కోట్ల అంచనా వ్యయంతో సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు చేపట్టడం జరిగిందని అధికారులు అన్నారు. ఇందులో జిల్లా ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే చోట ఉంటాయని తెలిపారు. 99 శాతం నిర్మాణ పనులు పూర్తయ్యాయని అధికారులు వివరించారు.
సమీకృత కలెక్టరేట్ పరిధిలో మిగిలి ఉన్న చివరి అంతర్గత పనులను త్వరితగతిన పూర్తి చేసి కార్యాలయాలను తరలించేందుకు సన్నద్దం చేయాలని జిల్లా పాలనాధికారి సూచించారు. సమీకృత కలెక్టరేట్ నిర్మాణం పురోగతిపై కలెక్టర్ సంగీత సంతృప్తి వ్యక్తం చేశారు. చివరి పనులను కూడా త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. అంతర్గత పనులను పెద్దపల్లి ఆర్డీఓ, ఈఈ ఆర్ అండ్ బీ స్వయంగా పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు.
ఇదీ చూడండి: రోజు విడిచి రోజు నీరు.. నేటి నుంచి సరఫరా