ఇరుకుగా మారిన గురుకుల పాఠశాల భవనం
పేద విద్యార్థుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మహాత్మ జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలను నెలకొల్పింది. ఇందులో పెద్దపల్లి నియోజకవర్గానికి చెందిన 250 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. కానీ గత నెల రోజుల క్రితం మంథని నియోజకవర్గంలోని గుంజ అడుగు, వెంకటాపూర్ గ్రామంలోని గురుకుల పాఠశాలకు చెందిన 400 మంది విద్యార్థినులు పెద్దపల్లి గురుకుల పాఠశాలలో అర్థాంతరంగా తీసుకొచ్చి చేర్చారు. ఫలితంగా గురుకుల పాఠశాల భవనం ఇరుకుగా మారింది.
ఇబ్బందులు పడుతున్న విద్యార్థినులు
పెద్దపల్లి గురుకుల పాఠశాలకు పక్కా భవనం లేదు. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు కళాశాలకు చెందిన రెండు భవనాలను అద్దెకు తీసుకొని 240 మంది విద్యార్థినులతో కొనసాగిస్తున్నారు. వీటి సామర్థ్యం 200 వరకే ఉంటుంది. కానీ 400 మందికి పైగా బాలికలను అధికారులు ఇందులో చేర్చడం వల్ల విద్యార్థినులకు తరగతి గదిలో ఊపిరాడని దుస్థితి నెలకొంది.
ఒక్క గదిలో 80 మంది బాలికలు
ఒక్క గదిని 80 మందికి పైగా విద్యార్థినులకు కేటాయించారు. బాలికలంతా ఒకేసారి భోజనం , స్నానాలు చేయడం, చదువును కొనసాగించడం, పడుకోవడం సమస్యగా మారింది. ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. మరుగుదొడ్లు, స్నానపు గదులు శుభ్రంగా లేకపోవడం వల్ల శ్వాసకోస వ్యాధులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కలెక్టర్‌కు ఫిర్యాదు.. అధికారుల్లో చలనం
గురుకుల పాఠశాలలో సమస్య రోజురోజుకు తీవ్రం కావడం వల్ల బాలికలు తల్లిదండ్రులకు ఈ విషయాన్ని తెలిపారు. వారు వెంటనే కలెక్టరేట్ ముందు ధర్నా చేసి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
సమస్యలు పరిష్కరిస్తామని హామీ
జిల్లా కలెక్టర్ దేవసేన ఈ విషయాన్ని జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డికి తెలియజేశారు. ఎమ్మెల్యే అధికారులను ఆదేశించగా... సాధ్యమైనంత వరకు సమస్యలు పరిష్కరిస్తామని సంక్షేమ శాఖ అధికారులు చెబుతున్నారు.
ఇవీ చూడండి: 'కొత్త అసెంబ్లీ డిజైన్ వివరాలివ్వండి'