పెద్దపల్లి జిల్లా మంథనిలోని ప్రయాణికుల ప్రాంగణం పరిసరాలు అపరిశుభ్రతకు చిరునామాగా నిలిచాయి. ఓ వైపు కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు పరిసరాలు శుభ్రంగా ఉంచాలని ప్రభుత్వం నిత్యం చెప్తున్నా మంథని బస్టాండులో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తుంది. నిత్యం ఇక్కడి నుంచి వరంగల్, భూపాలపల్లి, కరీంనగర్, హైదరాబాద్, గోదావరిఖని, మంచిర్యాలకు ప్రయాణికులు బస్సుల్లో ప్రయాణిస్తుంటారు. వేలాదిమంది ప్రయాణికులు వచ్చే మంథని ప్రాంగణం గోడల మీద పాన్, గుట్కా మరకలు, చెత్త చెదారంతో నిండి ఉంది. మురికి కాలువలో నీరు నిలిచి ఉండగా.. చెత్త కుండీల్లో నిండిపోయిన చెత్తను తొలగించే సిబ్బంది లేక బస్టాండ్ పరిసరాలు కంపు వాసన కొడుతున్నాయి.
బస్టాండ్ ఆవరణలో పందులు, కుక్కలు విచ్చలవిడిగా సంచరిస్తున్నాయి. పలువురు బహిరంగంగా మూత్ర విసర్జన చేస్తుండటం వల్ల ప్రాంగణ పరిసరాలు ఉచ్చ కంపు కొడుతున్నాయి. ఇలాంటి అపరిశుభ్రత వల్లే కరోనా వైరస్ వ్యాపించే అవకాశాలు ఎక్కువ. కరోనా ప్రబలకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాల్సిన అధికారులు మంథని ప్రయాణికుల ప్రాంగణాన్ని విస్మరించినట్టు కనబడుతున్నది. కరోనా వ్యాప్తికి బస్టాండులో అన్ని చర్యలు తీసుకున్నామని మంథని డిపో మేనేజర్ రవీంద్రనాథ్ చెప్పినప్పటికీ ఆచరణలో మాత్రం అది శూన్యమే అని అక్కడి పరిసరాలే చెప్తున్నాయి.
ఇదీ చూడండి: భద్రాద్రి రామయ్యపై కరోనా ప్రభావం.. భక్తులు లేకుండానే కల్యాణం