కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 26 న తలపెట్టనున్న దేశ వ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని హెచ్ఎంఎస్ కేంద్ర కమిటీ నాయకులు రియాజ్ అహ్మద్ కోరారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలో ఏర్పాటు చేసిన సమావేశంలో సమ్మె పోస్టర్ను హెచ్ఎంఎస్ నాయకులు ఆవిష్కరించారు.
కేంద్రంలో రెండోసారి భాజపా అధికారంలోకి వచ్చాక కార్మిక చట్టాలను సవరిస్తూ కార్మిక రంగానికి తీరని ద్రోహం చేసిందని రియాజ్ ఆరోపించారు. లాభాల బాటలో ఉన్న అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ ఉద్యోగులను ప్రభుత్వం రోడ్లపై వేస్తోందని మండిపడ్డారు. పరిశ్రమలను విస్తరించి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాల్సి ఉండగా వాటిని ప్రైవేటీకరణ చేసి ఉన్న ఉద్యోగాలను తొలగిస్తున్నారని ఎద్దేవా చేశారు.
దేశ వ్యాప్త కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఒక్కరోజు చేపట్టిన ఈ సమ్మెలో సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్, జైపూర్ పవర్ ప్లాంట్, రామగుండం పవర్ ప్లాంట్, కేశోరాం సిమెంట్ కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ రాష్ట్ర సలహాదారులు రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఎదురు కాల్పుల్లో మావోయిస్టు మృతి