పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సోదరి కుటుంబం మృతిని మిస్టరీ వీడిందని కరీంనగర్ సీపీ కమలాసన్‌రెడ్డి పేర్కొన్నారు. జనవరి 27న ఫర్టిలైజర్ వ్యాపారి నరెడ్డి సత్యనారాయణరెడ్డితో పాటు అతని సతీమణి రాధ, కూతురు వినయశ్రీ కారులో ఇంటి నుంచి బయలుదేరి వెళ్లారు. ఆ తర్వాత అతనికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా.. సమాచారం లేకపోవడం వల్ల ఏదైనా విహారయాత్రకు వెళ్లారేమోనని బంధువులు భావించారు. అయితే దాదాపు 20 రోజుల తర్వాత ఫిబ్రవరి 17న అల్గునూరు సమీపంలోని కాకతీయ కాల్వలో కారుతో పాటు మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి.
దీనితో పోలీసులు కారు ప్రమాదవశాత్తు పడిపోయిందా.. లేదా ఆత్మహత్య చేసుకున్నారా..? అనే కోణంలో విచారణ జరిపారు. ఈ క్రమంలో ఫర్టిలైజర్ దుకాణంలో ఒక సుసైడ్ లేఖ లభ్యమైంది. అయితే ఆ లేఖ సత్యనారాయణ రాసిందేనా.. అని తెలుసుకునేందుకు పోలీసులు రాత నిపుణుల వద్దకు పంపించారు. అతను గతంలో పుస్తకాల్లో రాసిన రాతను పరిశీలించిన నిపుణులు... ఆ లేఖ నరెడ్డి సత్యనారాయణదేనని తేల్చారు. దీనితో ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధరణ అయిందని సీపీ కమలాసన్‌రెడ్డి వెల్లడించారు. బలవన్మరణానికి కారణం మాత్రం వెల్లడించలేదు.
సంబంధిత కథనం: కాకతీయ కాలువలో ఎమ్మెల్యే చెల్లి, బావ, మేనకోడలి మృతదేహాలు