పెద్దపల్లి జిల్లా కేంద్రంలో వానాకాలం వరి ధాన్యం కొనుగోలుపై మంత్రి కొప్పులా ఈశ్వర్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ధాన్యం కొనుగోలుపై విస్తృతంగా చర్చించారు. వర్షాకాలం వరి ధాన్యం కొనుగోలు ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని, అందుకు అవసరమైన ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సీజన్లో ఎన్నడూ లేని విధంగా 4.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చినట్లు చెప్పారు.
రైతులు ధాన్యం అమ్మకానికి తీసుకు వచ్చే ముందు ఆరబెట్టి తీసుకురావాలని కోరారు. తూకంలో ఎలాంటి మోసాలు జరగకుండా ఎలక్ట్రికల్ కాంటాక్ట్లను ఈ ఏడాది వినియోగించనున్నట్లు మంత్రి చెప్పారు. సన్నం రకం ధాన్యానికి రూ.1,888 ఒకే ధరను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ధాన్యం కొనుగోలు పూర్తయ్యేంత వరకు అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని లేదంటే చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు.
ప్రజాప్రతినిధులు సైతం ధాన్యం కొనుగోలు సజావుగా సాగేందుకు సహాయ సహకారాలు అధికారులకు అందించాలని కొప్పుల కోరారు. ఈ సమావేశంలో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, జడ్పీ చైర్మన్ పుట్ట మధు, ప్రభుత్వ విప్ ప్రసాదరావు, కలెక్టర్ శశాంకతో పాటు వివిధ శాఖ అధికారులు హాజరయ్యారు.
ఇవీ చదవండి: 'మత్స సంపదపై ఆధారపడిన గంగపుత్రులకు సౌకర్యాలేవి?'