మహిళల సంరక్షణ పట్ల తెరాస ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరిస్తోందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ (Koppula Eshwar) పేర్కొన్నారు. అతివల భద్రత కోసం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సఖి వన్ స్టాప్ కేంద్రం భవన నిర్మాణానికి మంత్రి కొప్పుల ఈశ్వర్ శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, జడ్పీ ఛైర్మన్ పుట్ట మధుతో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
సమాజంలో మహిళలు గృహిణిలపై జరుగుతున్న అఘాయిత్యాలను పూర్తి స్థాయిలో అరికట్టేందుకు ఈ కేంద్రం ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. కొండంత ఆవేదనతో కేంద్రానికి వచ్చే బాధితులకు సిబ్బంది బాధ్యతగా చేయూతనివ్వాలని కోరారు. అన్ని శాఖల నుంచి సఖి కేంద్రానికి వచ్చే ఫిర్యాదులను కౌన్సెలింగ్ ద్వారా పరిష్కరిస్తున్నట్లు తెలిపారు.
గృహహింస జరిగిన క్రమంలో ఇంటి వద్దకే వెళ్లి సమస్యలను సామరస్యంగా పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. బాధిత మహిళలు ఎవరైనా నేరుగా సఖి కేంద్రాన్ని ఆశ్రయించవచ్చని మంత్రి పేర్కొన్నారు. పెద్దపెల్లి జిల్లా వ్యాప్తంగా సఖి కేంద్రంలో ఇప్పటి వరకు 400 పైగా మహిళ సమస్యల కేసులను పరిష్కరించినట్లు తెలిపారు.
ఎవరైతే హింసకు గురవుతున్నారో... వారికి అండగా నిలవాలనే ఉద్దేశ్యంతో సఖి కేంద్రం ప్రారంభించాం. 418 కేసులు నమోదైతే కౌన్సెలింగ్ ద్వారా పరిష్కరించాం. ఇందులో పనిచేసే వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. కేంద్రానికి వచ్చే బాధితులకు ధైర్యం, తామున్నామనే భరోసా కల్పించేలా ఈ సఖి సెంటర్ నడవాలని కోరుకుంటున్నా.
--- కొప్పుల ఈశ్వర్, మంత్రి
- ఇదీ చదవండి : పల్లె పాటకు కేటీఆర్ స్పందన.. బాలికకు డీఎస్పీ ఛాన్స్