పెద్దపల్లి జిల్లా మంథనిలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారు మొట్టమొదటిసారిగా బస్సులను శానిటైజేషన్ చేయడం కొరకు ప్రత్యేకంగా శానిటైజేషన్ యంత్రాన్ని తయారు చేసి మిగతా డిపోల వారికి ఆదర్శంగా నిలిచారు. దేశంలో కరోనా వ్యాప్తి చెందుతుండటం వల్ల దాని నివారణ కోసం అనేక చర్యలు చేపడుతున్నారు. దానిలో భాగంగా ప్రయాణికులకు ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ముందస్తుగా మంథని ఆర్టీసీ డిపో వారు చర్యలు చేపట్టారు. మంథని డిపోలో స్క్రాప్ కింద ఉన్న ఒక బస్సులోని ఎయిర్ ట్యాంక్‌ను తీసుకొని దానికి రెండు గేట్ వాల్స్ బిగించి, ఎయిర్ ప్రెషర్ ద్వారా శానిటైజర్‌ను పిచికారీ చేస్తున్నారు. దీనిలో 200 గ్రాముల రసాయనం, 20 లీటర్ల నీటిని మిక్స్ చేసి పోసి బస్సులలో శానిటైజ్ చేస్తున్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 10 డిపోలలో కచ్చితంగా బస్సులను శానిటైజ్ చేయాలని రీజినల్ మేనేజర్ ఆదేశించడం వల్ల మంథని డిపో మేనేజర్ ఆధ్వర్యంలో గ్యారేజ్ సిబ్బంది ప్రత్యేకంగా ఈ శానిటైజేషన్ మిషన్ తయారుచేసి అన్ని డిపోల వారికి ఆదర్శంగా నిలిచారు.
ప్రయాణికుల రక్షణే తమ ధ్యేయమని వారు పేర్కొన్నారు. ఈ యంత్రం తయారీకి సుమారు రూ.2,500 నుంచి 3వేల ఖర్చు మాత్రమే అవుతుందని తెలిపారు. ఇటువంటి యంత్రాలను అన్ని డిపోలలో ఏర్పాటు చేసుకోవాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా రీజినల్ మేనేజర్ ఆదేశాలు జారీ చేసినట్లు మంథని డిపో మేనేజర్ తెలిపారు.
ఇవీ చూడండి: 'అవ్వా.. బాగున్నావా... పానం ఎట్లుంది'