రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు 50 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్కు లేఖ రాశారు.
పీఆర్సీ రిపోర్టుపై 31 నెలలుగా ప్రగల్బాలు పలికిన రాష్ట్ర ప్రభుత్వం.. ఉద్యోగుల ఆకాంక్షలను నీరుగార్చిందని ఎమ్మెల్యే ఆరోపించారు. 7.5 శాతం ఫిట్మెంట్ ప్రకటించడం ఉద్యోగులను మోసం చేయడమేనని మండిపడ్డారు. పీఆర్సీ అంశంపై ముఖ్యమంత్రి పునరాలోచించి, వెంటనే ఉద్యోగులతో చర్చించాలన్నారు. వారు కోరుతున్న విధంగా 50 శాతం ఫిట్మెంట్ను త్వరలోనే ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఉద్యోగులు కోరుతున్న విధంగా హెచ్ఆర్ఏ స్లాబులను 20, 25, 30, 35గా పెంచాలని లేఖలో పేర్కొన్నారు. ఈహెచ్ఎస్ ఉద్యోగులకు వైద్య సేవలను ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉచితంగా అందించాలన్నారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ డీఏను యధావిధిగా అమలు చేయాలని కోరారు. ఉద్యోగుల కనిష్ఠ వేతనం రూ.27 వేలు ఉండేలా, కనిష్ఠ పెన్షన్ రూ.15 వేలుగా ఉండేలా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవాలని లేఖలో కోరారు.
ఇదీ చూడండి: సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజాకు అస్వస్థత