కరోనా పరీక్షలు, చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా మంథని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక నాయకులతో సమావేశమైన శ్రీధర్‌బాబు... కరోనాను నివారించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. శాస్త్రీయబద్ధంగా నివారణ పద్ధతులు పాటించకపోవటం వల్లే కరోనా విజృంభిస్తుందన్నారు.
రాష్ట్రంలో ఉన్న వాతావరణ పరిస్థితులకు కరోనా రాదని... పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుందని మాట్లాడిన కేసీఆర్... ఎలాంటి ముందస్తు రక్షణ చర్యలు తీసుకోకుండానే లాక్డౌన్ ప్రకటించారన్నారు. కనీసం వైద్య సిబ్బందికి కూడా మాస్కులు, గ్లౌసులు అందేలా చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. మంథని ప్రాంతంలో ఉన్న ఇసుక క్వారీలకు వచ్చే ఇతర ప్రాంతాల లారీ డ్రైవర్ల ద్వారా కరోనా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని... దీన్ని అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కేరళ, మహారాష్ట్ర ప్రభుత్వాలు పగడ్బందీగా కరోనా నియంత్రణ చర్యలు తీసుకుంటుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఎమ్మెల్యే ఆరోపించారు.