పెద్దపల్లి జిల్లా రాఘవపూర్కు చెందిన కొడిపాక స్వప్న, సదయ్యకు... సారిక, సాత్విక ఇద్దరు కుమార్తెలు. సారయ్య అనారోగ్యంతో 2005లో మరణించాడు. కుటుంబ పోషణంతా స్వప్నపైనే పడింది. చేతికందిన పని చేసుకుంటూ ఇద్దరు పిల్లల్ని ఇంటర్ వరకు చదివించింది. రెండేళ్ల క్రితం చిన్న కుమార్తె సాత్విక అనారోగ్యానికి గురై, తీవ్ర రక్తస్రావమైంది. వైద్య పరీక్షలు చేయించగా... రెండు కిడ్నీలు చెడిపోయినట్లు వైద్యులు నిర్ధరించారు. రెండు కిడ్నీలు మారిస్తేనే ఆరోగ్యం మెరుగుపడుతుందని వైద్యులు స్పష్టం చేశారు.
రెండేళ్లుగా డయాలసిస్
కిడ్నీలు దానం చేసే వారు లేక, వైద్యం చేయించేందుకు ఆర్థికస్థితి సహకరించక... ఏం చేయాలో పాలుపోక సతమతమవుతోంది సాత్విక తల్లి. రెండేళ్లుగా డయాలసిస్ చేయిస్తూ... దాతల సహకారం కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తోంది. నెలలో రెండుసార్లు రక్తమార్పిడి, మందులకు సుమారు రూ.30వేలకు పైగా ఖర్చువుతోంది. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ ద్వారా కరీంనగర్లో సాత్విక చికిత్స పొందుతోంది. చదువులో ముందుండే సాత్వికకు కిడ్నీలు ఎలా మార్పించాలో తోచడంలేదని స్వప్న ఆవేదన చెందుతోంది.
మనవరాలి కోసం తాత భిక్షాటన
ఇప్పటికే కష్టాలతో నిత్యం సహవాసం చేస్తుంటే... కరోనా కారణంగా ఉపాధి అర్ధాంతరంగా ఆగిపోయింది. సాత్వికకు వైద్య పరీక్షలు చేయించేందుకు స్వప్న తండ్రి రాజయ్య యాచకుడిగా మారాడు. సదయ్య మరణించినప్పటి నుంచి వారంతా తన ఇంట్లేనే ఉంటున్నారని, రక్త మార్పిడి చేయించేందుకు డబ్బులు లేక రైల్వే స్టేషన్, బస్టాండులో భిక్షాటన చేస్తున్నట్టు రాజయ్య చెప్పాడు. ఎంత చేసినా రోజుకు రూ. 500లు మాత్రమే వస్తున్నాయని, తన ఆరోగ్యం కూడా క్షీణిస్తోందని వాపోయాడు రాజయ్య.
కూతురిని ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని తల్లి, మనుమరాలికి వైద్యం అందించేందుకు ప్రభుత్వం సహకరించాలని తాత వేడుకుంటున్నారు. పుట్టెడు కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు ఆపన్నహస్తాలు ముందుకు రావాలని ఆశిద్దాం.
ఇదీ చూడండి: లాక్డౌన్ ముగిశాక కొత్త రూల్స్ ఇవే...