NTPC Thermal Power Station works Delayed: కేంద్ర విద్యుత్ మండలి మార్గదర్శకాల ప్రకారం కొత్తగా నిర్మించాల్సిన థర్మల్ విద్యుత్ కేంద్రనిర్మాణం మొదలుపెట్టిన 48నెలల్లోపు పూర్తి చేసి విద్యుదుత్పత్తి ప్రారంభించాల్సి ఉంటుంది. అయితే భూసేకరణ ఇతర సమస్యలు ఉంటేనే నాలుగేళ్ల కాలం తీసుకొంటుంది. పెద్దపల్లి జిల్లా రామగుండంలో మాత్రం ఎన్టీపీసీ సొంత స్థలంలోనే 1600 మెగావాట్ల విద్యుత్ కేంద్రానికి శ్రీకారం చుట్టింది.
ఒక్కొక్కటి 800మెగావాట్ల చొప్పున నిర్మాణానికి సిద్ధమైంది. రామగుండంలో సొంతస్థలంలోనే ఎన్టీపీసీ నిర్మాణం జరుగుతున్నా అంతులేని జాప్యంతో.. పాతికేళ్లపాటు ప్రజలపై భారీగా ఆర్థికభారం పడే అవకాశాలున్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.1600 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణానికి 10వేల598.98 కోట్ల రూపాయల వ్యయమవుతుందని తొలుత అంచనావేశారు.
పెరిగిన నిర్మాణ వ్యయం: ఏదైనా ధర్మల్ విద్యుత్ కేంద్రం- టీపీపీ నిర్మాణం ప్రారంభించేతేదీని ‘జీరో డేట్’గా వ్యవహరిస్తారు. ఈ ప్లాంట్ నిర్మాణానికి 2016 జనవరి 29గా నిర్ణయించారు. అంటే 2022 సెప్టెంబరు 28కి 80 నెలలు పూర్తయ్యాయి. ఇప్పటికీ విద్యుదుత్పత్తి ప్రారంభం కానందువల్ల నిర్మాణ వ్యయం అంచనా రూ.13వేల కోట్లకు మించి పోతుందని సమాచారం. ఇప్పటి వ్యయ అంచనాలను బట్టి ఇక్కడ ఉత్పత్తయ్యే కరెంటు చవకగా అందకపోగా యూనిట్ ధర 5రూపాయలు దాటనుంది.
ఆ లెక్కన పాతికేళ్లపాటు అధిక ధరలకు ప్లాంట్ నుంచి తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు కరెంటు కొని ప్రజలకు సరఫరా చేస్తే నెలవారీ బిల్లు భారం అదనంగా పడనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రామగుండంలో తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌లో 800 మెగావాట్లు ఉత్పత్తి చేసే మొదటి యూనిట్ స్టేజ్-I పనులు ఇంకా కొనసాగుతున్నాయి.
కొత్తగా నిర్మిస్తున్న ఎన్టీపీసీ రామగుండం యూనిట్ ప్రధాన ఆవిరి, కోల్డ్ రీహీట్ స్టీమ్ లైన్ల మిశ్రమ ఆవిరిని విజయవంతంగా నిర్వహించినట్లు.. చీఫ్ జనరల్ మేనేజర్ సునీల్‌కుమార్ ప్రకటించారు. బాయిలర్ నాన్-డ్రెయినబుల్ పోర్షన్ హైడ్రో పరీక్ష విజయవంతంగా పూర్తికాగా.. రెండోయూనట్‌లో బాయిలర్ లైట్-అప్ కోసం పనులు సాగుతున్నట్లు తెలిపారు. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో భాగంగా తెలంగాణకు 4000 మెగావాట్ల సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌ను కేంద్రం మంజూరు చేసింది.
ఆ క్రమంలో ఎన్టీపీసీ రామగుండం 1600 మెగావాట్ల తొలి దశ పనులు చేపడుతోంది. అందులో భాగంగా కోల్డ్ రీహీట్ స్టీమ్ లైన్ల మిశ్రమ ఆవిరి విధానం పూర్తి చేసింది. 2016 ఆగస్టులో ప్రధాని నరేంద్ర మోదీ ఆ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ప్రాజెక్ట్ ప్రతిపాదిత వ్యయం 10 వేల 598 కోట్ల రూపాయలు కాగా టీఎస్ఎన్పీడీసీఎల్తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఇప్పటికే పూర్తైంది.
అల్ట్రా-సూపర్ క్రిటికల్ టెక్నాలజీ: ఎన్టీపీసీ అధికారులు అల్ట్రా-సూపర్ క్రిటికల్ టెక్నాలజీ ఉపయోగిస్తుండటంతో బొగ్గువినియోగం తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందని.. తద్వారా వాతావరణ కాలుష్యం తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. ఎన్టీపీసీ తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ శంకుస్థాపనలో 2019 నవంబర్ 5నాటికి తొలి ప్లాంట్.. 2020 ఏప్రిల్ 5కల్లా రెండోది నిర్మాణం పూర్తి చేస్తామని ప్రకటించారు.
అయితే ఇప్పటి వరకు ఒక్కటి పూర్తి కాలేదు. వచ్చే డిసెంబర్ నాటికి తొలి ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభిస్తుందని చెబుతున్నారు. కానీ ఇప్పటికే రూ. 10,598.98 అంచనా వ్యయం కాస్తా రూ.13వేల కోట్లు దాటడంతో... ప్లాంట్ పూర్తయ్యేనాటికి వ్యయం ఏమేరకు పెరుగుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఇవీ చదవండి: పీఎఫ్ఐ కేసులో ఎన్‌ఐఏ దర్యాప్తు ముమ్మరం.. కొనసాగుతున్న కస్టడీ విచారణ
అధ్యక్ష ఎన్నికల పోటీ నుంచి దిగ్విజయ్ ఔట్.. రేసులో ఖర్గే.. నామినేషన్ వేసిన శశి థరూర్