Traffic Problems Of Peddapally Residents: సికింద్రాబాద్ నుంచి మంచిర్యాల జిల్లా ఇందారం వరకు 235కిలోమీట్లర్ల పొడవున్న రాజీవ్ రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించే పనులు 2011లో మెుదలుకాగా 2013లో పూర్తయ్యాయి. పట్టణం నడిబొడ్డు నుంచి ఆ రోడ్డు వెళ్లడం పారిశ్రామిక ప్రాంతాలైన గోదావరిఖని, మంచిర్యాల, రామగుండాలు పక్కనే ఉండటంతో భారీవాహనాలు తాకిడి ఆ రహదారికి అధికంగా ఉంటుంది. రద్దీకి అనుగుణంగా అప్పటి ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లతో పెద్దపల్లి, సుల్తానాబాద్, కుకునూరుపల్లి, ప్రజ్ఞాపూర్ వంటిచోట ప్రత్యామ్నాయ రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతించింది.
అందుకు సంబంధించిన సర్వే సైతం పూర్తి చేశారు. పెద్దపల్లిలో 8కిలోమీటర్లకుపైగా బైపాస్ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించారు. తొలి విడతలో రూ. 110 కోట్లను ప్రభుత్వం విడుదలచేసింది. సరిగ్గా ఆసమాయానికే రాష్ట్రవిభజన జరగడంతో ప్రక్రియ నిలిచిపోయాయి. నిధులు వెనక్కిమళ్లాయి. సమస్యపై పట్టించేవారే లేకుండాపోయారని స్థానికులుఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం సిద్ధిపేట జిల్లాలో మాత్రం బైపాస్‌లు నిర్మించి పెద్దపల్లికి అన్యాయం చేసిందని ఆరోపిస్తున్నారు.
గతంతో పోలిస్తే పెద్దపల్లిమీదుగా ప్రయాణించే వాహనాల సంఖ్య రెట్టింపైంది. బసంత్‌నగర్ టోల్ ప్లాజా గణాంకాల ప్రకారం రోజూ 8వేల నుంచి 9వేల దాకా వాహనాలు రాకపోకలు సాగిస్తుండటంతో రోడ్డు ప్రమాదాలపై పోలీస్‌శాఖ ప్రత్యేక దృష్టిసారించింది. ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టింది. ఎక్కడెక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయో పరిశీలించి ఆ ప్రాంతాలను బ్లాక్‌స్పాట్లుగా గుర్తించి ప్రత్యేక చర్యలు చేపట్టింది. ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగిన దృష్ట్యా నిబంధనలు పాటిస్తే చాలా వరకు ప్రమాదాలు అరికట్టవచ్చని పోలీసులు తెలుపుతున్నారు.
ప్రస్తుతం రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నా శాశ్వతంగా సమస్య పరిష్కారం కావాలంటే బైపాస్‌రోడ్డు ఒక్కటే మార్గమని స్థానికులు సూచిస్తున్నారు. ప్రజాఅవసరాలు దృష్టిలో పెట్టుకొని ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని వారు కోరుతున్నారు.
"పెద్దపల్లి డివిజిన్లో రాజీవ్ రహదారి 80 కి.మీ వరకు ఉంది. నిత్యం మా సిబ్బందితో ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూసుకుంటున్నాం. రోడ్డు ప్రమాదాలపై నిత్యం ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం."-సారంగపాణి ఏసీపీ పెద్దపల్లి జిల్లా
"పెద్దపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ సమస్య ఉంది. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు వాహనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ ప్రాంతం మొత్తం ఇండస్ట్రీయల్ ఏరియా కావడంతో ట్రాఫిక్ సమస్య చాలా ఎక్కువగా ఉంది. మా దగ్గర ఉన్న సిబ్బందితో అలా ట్రాఫిక్ క్రమబద్దీకరిస్తున్నాం".-అనిల్ ట్రాఫిక్ సీఐ, పెద్దపల్లి జిల్లా
"పెద్దపల్లిలో ట్రాఫిక్ సమస్య బాగా ఉంది. బారీ వహనాలు రావడంతో ట్రాఫిక్ సమస్యలు బాగా పెరిగిపోయాయి. చాలా మంది రోడ్డు ప్రమాదాలకు గురై చనిపోతున్నారు. ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి సిగ్నల్స్ ఏర్పాటు చేయించాలి. అంతే కాకుండా పాత బైపాస్ రోడ్లు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నాం."- స్థానికులు
ఇవీ చదవండి: