పెద్దపల్లి జిల్లా మంథని ఎస్సై ఓంకార్ యాదవ్ తమను వేధిస్తున్నాడని మల్లారం గ్రామానికి చెందిన సాయిని సరిత, సాయిని రమేష్ హెచ్ఆర్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. తమ తండ్రి పేరుపై ఉన్న 10 గుంటల భూమిని తమ బాబాయ్ ఆక్రమించేందుకు యత్నిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంపై గత నెల 30న బాబాయ్ సాయిని వెంకన్న, పిన్ని పద్మ, వారి కొడుకు అవినాష్‌లు తమ కుటుంబంపై దాడి చేసినట్లు కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు.
మంథని ఠాణాలో ఫిర్యాదు..
ఈ వ్యవహారంపై మంథని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు సైతం చేసినట్లు బాధితులు పేర్కొన్నారు. ఎస్సై ఓంకార్ యాదవ్ తమ 10 గుంటల భూమిని వదులుకోవాలని అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని వాపోయారు. అనంతరం విచక్షణా రహితంగా చితకబాదారని ఆందోళన వ్యక్తం చేశారు.
అన్న కుమార్తెను వివస్త్రగా..
తమ బాబాయ్, మహిళ అని కూడా చూడకుండా తనను వివస్త్రను చేసి కొట్టినట్లు బాధితురాలు సాయిని సరిత వాపోయారు.
ఆ కుటుంబం నుంచి ప్రాణహాని..
తమకు, తమ కుటుంబానికి బాబాయ్ సాయిని వెంకన్న కుటుంబం, ఎస్సై ఓంకార్ యాదవ్ నుంచి ప్రాణహాని ఉందని కమిషన్‌కు గోడు వెళ్లబోసుకున్నారు.
ఎస్సైపై కఠిన చర్యలు తీసుకోవాలి..
కబ్జాదారులకు మద్దతు ఇస్తున్న ఎస్ఐపై క్రిమినల్ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కమిషన్‌ను కోరారు. తమకు రక్షణ కల్పించాలని మానవ హక్కుల సంఘం కమిషన్ ఛైర్మన్‌ను వేడుకున్నారు.
ఇవీ చూడండి : దుబ్బాక తహసీల్దార్ కారుకు అడ్డంగా పడుకొని నిరసన..