పెద్దపల్లి జిల్లా మంథని మండలం నగరంపల్లికి చెందిన పెగడ సంజీవ్ నాలుగెకరాల్లో వరివేశాడు. లక్షరూపాయలకు పైగా ఖర్చు చేసి బావి తవ్వించాడు. దీనికి ఎస్సారెస్పీ ద్వారా కూడా నీరందుతుందని ఆశించాడు. ప్రకృతి మాత్రం అన్నదాతపై కన్నెర్రజేసింది. పంట కీలక దశలో ఉండగా బావి ఎండిపోయింది. నీరందే అవకాశం లేకుండా పోయింది.
మళ్లీ అప్పుచేసి మరో బావి తవ్వించినా నీరు పడలేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న పొలం కళ్లెదుటే రోజురోజుకూ ఎండిపోవటం చూసి మానసికంగా కుంగిపోయాడు. పైరుకు నిప్పు పెట్టి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాడు.
ఇది గమనించిన పక్క పొలంలోని రైతులు వారించి మందు డబ్బాను లాక్కుని అతన్ని కాపాడారు. పంటపై రూ.2 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టానని, ఎండి పోవటంతో ఆందోళన చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు బాధితుడు తెలిపాడు.
అన్నదాతలో ఆందోళన
ఏపుగా పెరిగిన పంట మరి కొన్ని రోజుల్లో చేతికొస్తుందనుకున్న కర్షకుల ఆశల్ని నీటి కొరత హరించివేసింది. అధికారులకు గోడు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చదవండి: తెలుగు సంవత్సర వసంతాగమనం