గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీపాద ఎల్లంపల్లి జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుకుంది. దీంతో ఎల్లంపల్లి జలాశయం నిండుకుండను తలపిస్తోంది. పెద్దపెల్లి జిల్లా అంతర్గాం మండలం ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వస్తుంది. ప్రాజెక్టు 20 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎల్లంపల్లి జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ 20 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 18.4805 టీఎంసీలుగా ఉంది.
పూర్తిస్థాయి నీటి మట్టం 148 మీటర్లకుగాను ప్రస్తుతం 147.39 మీటర్లుగా కొనసాగుతోంది. ఇన్ఫ్లో 1,30,541 క్యూసెక్కులు కాగా.. అవుట్ ఫ్లో 2,03,860 క్యూసెక్కులుగా ఉంది. నీటి విడుదల నేపథ్యంలో అధికారులు ప్రాజెక్టు పరిసర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఎవరూ చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు.
మంగళవారం మధ్యాహ్నం గోదావరి నదిలో రెండు టాక్టర్లు పూర్తిగా నీట మునిగాయి. ఒక్కసారిగా నీరు గోదావరిని ముంచెత్తడం వల్ల కూలీలు నది లోపల నుంచి ఒడ్డు వైపుకు పరుగులు పెట్టారు. నదిలో ఆరు ట్రాక్టర్లతో అక్రమంగా ఇసుక లోడింగ్ చేపట్టారు. గేట్లు ఎత్తడం వల్ల నదిలో నీటి ప్రవాహం పెరిగింది. డ్రైవర్లు నాలుగు ట్రాక్టర్లను నీటిలోనే నడుపుతూ ఒడ్డుకు చేర్చారు. సుమారు 30 మంది కూలీలు ప్రాణాలతో బయట పడ్డారు. డ్యాం వద్ద అధికారులు హారన్ మోగించినా వారు పట్టించుకోలేదు. నీటి ప్రవాహం పెరగడం చూసి పరుగులు తీశారు.
ఇదీ చూడండి : భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా 13 మంది మృతి