పార్వతి బ్యారేజ్ నుంచి విడుదలవుతున్న నీటితో తమ పంటలు నాశనమవుతున్నామని రైతులు నిరసన చేపట్టారు. రెండేళ్లుగా తీవ్ర నష్టాల పాలవుతున్న అధికారులెవరూ పట్టించుకోవడం లేదని ఆందోళనకు దిగారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం వద్ద రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. రైతుల ఆందోళనతో సుమారు గంటన్నరపాటు రహదారికి ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి రవాణా స్తంభించిపోయింది. దీంతో పోలీసులు వచ్చి రైతులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన పార్వతి బ్యారేజ్ నుంచి నీరు విడుదల చేయడంతో ఈ ఏడాదిలోనే మూడుసార్లు పంటలు నీటిలో మునిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతవరకు ఏ అధికారి కూడా వచ్చి పరిశీలించలేదని మండిపడ్డారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు నామామాత్రంగా లెక్కలు రాసుకుపోతున్నా ఇప్పటివరకు పరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
పొలాల్లో చేపలు పడుతున్నారు
పంట మొత్తం నీటిలో మునిగిపోవడంతో తమ పొలాల్లో చేపలు పడుతున్నారని ఓ మహిళా రైతు వాపోయారు. పడవలు వేసుకుని చేపలు పట్టుకుంటున్నారని.. తమ పంట మొత్తం నాశనమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యారేజ్ కరకట్ట కుంగిపోతే వెంటనే మరమ్మతులు చేయించిన అధికారులకు.. రైతుల కష్టాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కరకట్ట ముందుభాగంలో మరింత కూలిపోతే గ్రామానికి ఎంతో నష్టం వాటిల్లుతుందని.. మా బాధలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో రోడ్డుపై ఆందోళన చేస్తున్నామని రైతులు తెలిపారు. ఐదు రోజులుగా మంథని నియోజకవర్గంలోని గోదావరి తీర గ్రామాల రైతులు పంటలు నష్టపోతున్నామని రోడ్డెక్కి నిరసనలు తెలియజేస్తున్నారు.
ఇదీ చూడండి: Ramappa: 'రామప్ప' ముంపు బాధిత రైతులను ఆదుకోవాలి: ఎమ్మెల్యే సీతక్క