ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నదిలో వరద నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు జలాశయానికి ఇన్ ఫ్లో 62,393 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తి సామర్థ్యానికి దగ్గరగా నీటిమట్టం చేరింది. సాయంత్రం 6 గంటలకు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసేందుకు ప్రాజెక్టు అధికారులు సైరన్ మోగించారు.
ఎల్లంపల్లి ఎగువ నుంచి వచ్చే గోదావరి నీటితో పాటు కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తి వదిలిన నీరు జలాశయం లోకి వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం నీటిమట్టం 148 మీటర్లు కాగా... నీటి నిల్వ 20.175 టీఎంసీలు, సాయంత్రం 6 గంటలకు జలాశయంలో నీటిమట్టం 147.57 మీటర్లు, నీటి నిల్వ 18.98 టీఎంసీలుంది. ఎగువ నుంచి ఇన్ ఫ్లో 58,524 క్యూసెక్కులు ఉండగా... అవుట్ ఫ్లో 649 క్యూసెక్కులు ఉంది.
ఎన్టీపీసీ తాగునీటి పథకాలకు నీటి సరఫరా చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం కడెం ప్రాజెక్టు ఒక గేటి ఎత్తి దిగువకు వదిలిన 3,669 క్యూసెక్కుల నీరు సోమవారం ఉదయానికి ఎల్లంపల్లి చేరుకుంది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు కడెం ప్రాజెక్టులో ఎత్తిన గేటు ద్వారా 5,972 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ క్రమంలో ప్రాజెక్టు అధికారులు ఏ సమయంలోనైనా ఎల్లంపల్లి గేట్లు ఎత్తే ప్రయత్నాలు చేస్తున్నారు. నీటి వరద ప్రవాహంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు జలాశయం నిండుకుండలా కనిపిస్తోంది.