గతేడాది జులై, ఆగస్టు నెలల్లోనే భారీ వర్షాలు కురవడంతో జలాశయాలు నిండాయి. జులైలో సాధారణ వర్షపాతం నమోదు కావడంతో రైతులు ఆగస్టుపైనే ఆశలు పెంచుకున్నారు. జిల్లాలోని సాగు విస్తీర్ణంలో సగానికి కంటే తక్కువగానే పంటలు సాగయ్యాయి. జిల్లాలో సాధారణ వర్షపాతం 490.2 మి.మీ. కాగా 502.1 మి.మీ.ల వర్షపాతం నమోదైంది.
రెండేళ్లుగా ఆగస్టులోనే భారీ వర్షాలు
జులైలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. పలు మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. ఎస్సారెస్పీ చివరి ఆయకట్టు ప్రాంతాలైన కాల్వశ్రీరాంపూర్, ఓదెల, ముత్తారం మండలాల్లో పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. కొందరు రైతులు దుక్కులు దున్ని పత్తి విత్తనాలు వేశారు. కాల్వశ్రీరాంపూర్ మండలంలో వర్షాలు లేకున్నా ఎత్తిపోతల పథకం ద్వారా చెరువులు నింపుతుండటంతో పంటల సాగు ఊరట కలిగిస్తోంది. కమాన్‌పూర్ మండలంలో గుండారం జలాశయం ఆశలు నింపుతోంది. ఎలిగేడు మండలంలో తక్కువ వర్షపాతం నమోదైంది. రెండేళ్లుగా ఆగస్టు నెలల్లోనే భారీ వర్షాలు కురుస్తున్నాయి. గతేడాది జులైలో 501.2 మి.మీ.ల సాధారణ వర్షపాతానికి గాను 385.2 మి.మీ.ల వర్షం కురిసింది. అంటే అప్పుడు కూడా లోటు కనిపించింది.
బోర్ల కింద కళ కళ.. చెరువుల కింద వెలవెల
ఈ వానాకాలంలో జిల్లాలో 1,32,014 మంది రైతులకు చెందిన 1,74,048 ఎకరాల విస్తీర్ణంలో వరి సాగవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. కాగా ఇప్పటివరకు 78,425.39 ఎకరాల్లో నాట్లు వేశారు. 72,909.2 ఎకరాల్లో పత్తి సాగు అంచనా వేయగా దాదాపు పూర్తయిందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. 327 ఎకరాల్లో పెసర, 929.05 ఎకరాల్లో కంది, 2.21 ఎకరాల్లో వేరుశనగ, 397.18 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. వరి, పత్తి పంటలతో పాటు ఎక్కువగా ఆరుతడి పంటలైన పెసర, కందులు, మొక్కజొన్న, మిర్చి, మినుము, పసుపు పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాఖ ప్రచారం చేసినప్పటికీ రైతులు ఆసక్తి చూపడం లేదు. బోర్ల కింద పంటలు సాగవుతుండగా, చెరువులు, కుంటల పరిధిలో ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారింది.
జిల్లాలో జులైలో నమోదైన వర్షపాతం(మి.మీ.)
- ధర్మారం 499.7- 563.9
- పాలకుర్తి 504.7 - 472.8
- అంతర్గాం 533.3 - 486.4
- రామగుండం 533.3 - 625.1
- రామగిరి 475.7- 495.8
- కమాన్‌పూర్ 475.7- 528.9
- పెద్దపల్లి 460.6 -455.3
- జూలపల్లి 429.7- 541.3
- ఎలిగేడు 509.2- 393.8
- సుల్తానాబాద్ 509.2- 516.2
- ఓదెల 439.4 -413.5
- శ్రీరాంపూర్ 491.5 -481.5
- ముత్తారం 487.5- 456.4
- మంథని 513.1- 598.9