పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు గ్రామానికి చెందిన న్యాయవాదులు గట్టు వామన్‌రావు, నాగమణి దంపతుల కుటుంబాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు పరామర్శించారు. వీహెచ్‌తో వారి కుటుంబసభ్యులు బోరున విలపిస్తూ తమకు అన్యాయం జరిగిందని.. న్యాయం చేయాలని వేడుకున్నారు. దంపతుల హత్యపై పూర్తి వివరాలను వారి కుటుంబీకులను అడిగి వీహెచ్ తెలుసుకున్నారు. తమ కొడుకు, కోడలును అన్యాయంగా నడిరోడ్డుపై నరికి చంపిన దోషులను కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని వామన్‌రావు తల్లిదండ్రులు కోరారు.
మర్డర్ డే..
పేదల పక్షాన న్యాయం కోసం కేసులను వాదించే న్యాయవాద దంపతుల హత్యను ఖండిస్తున్నట్లు వీహెచ్ పేర్కొన్నారు. న్యాయం కోసం ప్రశ్నిస్తే చంపుతారా అని మండిపడ్డారు. కేసీఆర్ పుట్టినరోజుకు ప్రతి సంవత్సరం ఎవరో ఒకరిని హత్యచేసి బహుమతిగా ఇవ్వాలా అని విమర్శించారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 17న కేసీఆర్ పుట్టినరోజు కాకుండా, 'మర్డర్ డే'గా గుర్తుంచుకునే విధంగా ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ శవ రాజకీయాలు చేయడం లేదని, ప్రజల పక్షాన నిలుస్తుందని స్పష్టం చేశారు.
సీబీఐతో విచారణ జరిపించాలి
'కేసీఆర్ జన్మదినం రోజు కేకులు కోయడం, చెట్లను నాటడం, మనుషుల పీకలు కోయడం జరుగుతోంది. నా 42 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి హత్యలను చూడలేదు. ఈ తరహా సంఘటనలు రాయలసీమలో జరుగుతాయి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన దర్యాప్తు బృందంపై మాకు నమ్మకం లేదు.. సీబీఐతో విచారణ జరిపించాలి. '
వి.హనుమంతరావు, కాంగ్రెస్ సీనియర్ నేత
ఇదీ చదవండి: జంట హత్యలపై వివరాలను సేకరించిన భాజపా లీగల్ సెల్