ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పెద్దపెల్లి జిల్లాలోని మానేరు(manair dam) వాగుపై నిర్మాణ దశలో ఉన్న పలు చెక్ డ్యాం(check dam)లు వరద తాకిడికి కొట్టుకుపోయాయి. స్థానికంగా కురిసిన భారీ వర్షాలతో పాటు ఎల్ఎండీ(LMD) గేట్లు ఎత్తివేయడంతో మానేరు వాగులో వరద తీవ్రత విపరీతంగా పెరిగింది. దీంతో సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల గ్రామంలోని వాగుపై నిర్మిస్తున్న చెక్ డ్యాం ధ్వంసమైంది.
డ్యాం ధ్వంసం
అతి వేగంగా వరద రావడంతో వాగుకు అడ్డుగా ఉన్న సిమెంట్ గోడలు ముక్కలు అయ్యాయి. అలాగే ఓదెల మండలం కనగర్తి గ్రామంలోని వాగుపై నిర్మాణం దశలో ఉన్న చెక్ డ్యామ్ సైతం వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. చెక్ డ్యాం గోడలు, దిమ్మెలు ధ్వంసం అయి నీటమునిగాయి.
రూ.కోట్లలో నష్టం
వర్షాల వల్ల సుమారు రూ.5 కోట్ల వరకు నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక్కడ సుమారు రూ.22 కోట్ల వ్యయంతో చెక్ డ్యాం నిర్మిస్తుండగా వరద తాకిడికి 30 ఫీట్ల వరకు కొట్టుకుపోయినట్లు స్థానికులు తెలిపారు. గుత్తేదారులు నాసిరకంగా పనులు చేపట్టడం వల్లే వరద ప్రవాహానికి ధ్వంసం అయ్యాయని ఆరోపిస్తున్నారు.
చర్యలేవి?
ప్రస్తుతం వరద ప్రవాహం తగ్గింది. అయినా ధ్వంసమైన చెక్ డ్యాంల మరమ్మతుల కోసం అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా స్పందించి నాణ్యతతో కూడిన చెక్‌డ్యాంల నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: Hyderabad rains: అప్పుడు ప్రాజెక్టే కట్టారు.. ఇప్పుడు కాలువలు నిర్మించలేరా?