పెద్దపెల్లి జిల్లా మంథనిలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పర్యటించారు. మంథని ఠాణాలో ఇటీవల చనిపోయిన శీలం రంగయ్య మృతిపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు. మంథని పోలీస్ స్టేషన్లో శీలం రంగయ్య ఆత్మహత్య చేసుకుంటే ఎస్సీల ఆచారం ప్రకారం పూడ్చి పెట్టకుండా శవాన్ని ఎందుకు దహనం చేశారని భట్టి ప్రశ్నించారు.
సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించట్లేదు ?
ప్రభుత్వం రంగయ్య కుటుంబాన్ని భయబ్రాంతులకు గురి చేస్తున్నారని భట్టి ఆందోళన వ్యక్తం చేశారు. రంగయ్య చనిపోయిన రోజు ఇద్దరు పోలీసు అధికారులు వారింటికి ఎందుకు వెళ్లారన్నారు. రంగయ్య మృతిపై సీబీఐ, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
సంఘటనపై ఇప్పటి వరకు ముఖ్యమంత్రి , హోం మంత్రి , డీజీపీ కనీసం స్పందించలేదన్నారు. రాష్టంలో ఎస్సీలపై జరుగుతున్న హత్యలపై రాష్ట్రపతి, గవర్నర్, కేంద్ర రాష్ట్ర మానవహక్కుల సంఘం, ఎస్సీ ఎస్టీ కమిషన్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు.
మృతుల కుటుంబాలకు రూ.కోటి ఇవ్వాలి !
ఓపెన్ కాస్ట్ ఉపరితల బొగ్గు గనిలో మంగళవారం జరిగిన ప్రమాదంలో మృతుల కుటుంబాలకు శాశ్వత ఉద్యోగంతో పాటు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గాయపడిన వారికి చికిత్స చేయించి ఉద్యోగం ఇవ్వాలన్నారు.
కేసీఆర్ పతనం ప్రారంభమైంది!
ముఖ్యమంత్రి కేసీఆర్ కలల ప్రాజెక్ట్ కాళేశ్వరం ఉన్న మంథని నియోజకవర్గం నుంచే ఎస్సీలపై జరుగుతున్న దాడులను ఎండగడతామని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ అన్నారు. సర్కార్‌పై పోరాటానికి ఇక్కడ్నుంచే శ్రీకారం చుట్టి ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి : మెట్రో టికెట్ ధరలపై హైకోర్టులో సీపీఎం పిటిషన్