న్యాయవాది దంపతుల హత్యను భాజపా తీవ్రంగా ఖండిస్తోందని... ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రిలో మృతదేహాలను పరిశీలించిన బండి... వామన్రావు తల్లిదండ్రులను పరామర్శించారు. ఇది సర్కారు హత్యేనని... ప్రభుత్వ సాయంతో పథకం ప్రకారమే హతమార్చారని ఆరోపించారు. వామన్రావు ప్రభుత్వంపై పోరాడుతున్నందునే హత్య చేశారన్నారు.
న్యాయవాదులను అతి కిరాతకంగా హతమార్చడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. స్పందించకుంటే హత్యను సీఎం సమర్థించినట్టేనని అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరూ మానవత్వంతో ఈ దారుణాన్ని ఖండిస్తున్నారని చెప్పారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి... హత్య వెనుక ఎవరున్నారో వెంటనే తెల్చాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ వెంట పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, చొప్పదండి మాజీ ఎమ్మెల్యేలు బొడిగె శోభ, రామగుండం మాజీ ఎమ్మెల్యే, భాజపా జిల్లా అధ్యక్షుడు సోమారపు సత్యనారాయణ ఉన్నారు.
ఇదీ చూడండి: న్యాయవాదుల హత్యకు కారణమేంటి? అసలేం జరిగింది?