పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎగ్లాస్పూర్ గ్రామ శివారులో ప్రమాదం సంభవించింది. మంచిర్యాల నుంచి భూపాలపల్లికి వెళ్తున్న ఆర్టీసీ బస్సును... ఎదురుగా వచ్చిన ద్విచక్రవాహనం దాటుకుని వెళ్లే క్రమంలో వెనకభాగాన్ని ఢీకొంది. బస్సు వెనక టైర్ల భాగంలో తాకటం వల్ల ద్విచక్రవాహనం కిందపడిపోయింది.
ఈ ప్రమాదంలో వాహనదారులు ఎక్లాస్‌పూర్‌కి చెందిన మాచిడి సమ్మయ్య గౌడ్, శ్రీరాములు తీవ్రంగా గాయపడ్డారు. సమ్మయ్యకు తలభాగంలో గాయమై తీవ్ర రక్తస్రావం జరిగి.. ఘటనాస్థలిలోనే మృతిచెందాడు.
వాహనం నడుపుతున్న శ్రీరాములును ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో రహదారికి ఇరువైపులా గంటపాటు వాహనాలు నిలిచిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న మంథని పోలీసులు... శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. స్తంభించిన ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.