నిజామాబాద్ జిల్లాలో ఐదు అంగన్‌వాడీ ప్రాజెక్టులున్నాయి. వీటి పరిధిలో ప్రధాన కేంద్రాలు 1,365, మినీ కేంద్రాలు 135, గర్భిణులు 13,668, బాలింతలు 12,723, ఆరు నెలల నుంచి 6 ఏళ్ల లోపు పిల్లలు 78,697 ఉన్నారు. వీరందరూ అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా లబ్ధిపొందుతున్నారు. కరోనా కారణంగా కేంద్రాలు మూసేయడం వల్ల చిన్నారులకు ఆన్‌లైన్‌లో విద్యాబోధన చేస్తున్నారు.
ఇలా చేస్తారు...
మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టరేట్ నుంచి రోజూ పీడీ, సీడీపీవోలకు దృశ్యశ్రవణతో పాటు సంక్షిప్త సందేశాలు వాట్సాప్‌లో వస్తాయి. సూపర్‌వైజర్లు వీటిని అంగన్‌వాడీ టీచర్లకు చేరవేస్తారు. అక్కడి నుంచి గర్భిణులు, బాలింతలు, చిన్నారుల తల్లిదండ్రులతో కూడిన వాట్సాప్ గ్రూప్‌లకు పంపిస్తారు. వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పౌష్టికాహార వివరాలు, చిన్నారుల వికాసానికి అవసరమైన అంశాలు ఉంటాయి.
సద్వినియోగం చేసుకోవాలి
- ఝాన్సీలక్ష్మీ, మహిళా, శిశు సంక్షేమ శాఖ ఇన్‌ఛార్జి పీడీ
గర్భిణులు, బాలింతలు, పిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించడానికి నూతనంగా ఆన్‌లైన్ కౌన్సెలింగ్ చేపడుతున్నాం. కేంద్రాల వారీగా అంగన్‌వాడీ టీచర్లు ఏర్పాటు చేసిన గ్రూప్‌లకు రోజూ సందేశాలు పంపిస్తున్నాం. ఈ అవకాశాన్ని వారందరూ సద్వినియోగం చేసుకోవాలి.